హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యోదంతంలో నిందితులైన వారిని తక్షణం ఉరి తీయాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది కదా? ‘జస్టిస్ ఫర్ దిశ’ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లోనూ చర్చ జరిగిన సందర్భంగా అనేక మంది ఎంపీలు దిశ హత్యోదంతంలో నిందితులను ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జాప్యం లేకుండా 30 రోజుల్లోనే వారికి ఉరి శిక్ష విధించాలని కొందరు ఎంపీలు పట్టుబడుతున్నారు. సరే ప్రభుత్వం అత్యంత వేగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, అదే వేగంతో విచారణ పూర్తయి, దిశ హంతకులకు కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందే అనుకుందాం. ఏం జరుగుతుంది? వెంటనే వారికి ఉరి వేస్తారా? అదేంటి… శిక్ష వెంటనే అమలు జరగాలి కదా? అంటారా? ఓకే… కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన శిక్షపై పైకోర్టులో అప్పీలు, రాష్ట్రపతి క్షమాభిక్ష వంటి అంశాలను కాసేపు వదిలేయండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేద్దాం.

కాస్త వెనక్కి వెడదాం. ఏడేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే కదా? నిర్భయ ఘటనగా వ్యవహరిస్తున్న ఈ కేసులో దోషులైన కామాంధులకు ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా నిందితులకు ఉరే సరైన శిక్షగా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని దోషులు రాష్ట్రపతిని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది.

అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నిర్భయ దోషుల క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరిస్తే వీరికి విధించిన ఉరి శిక్షను అమలు చేయాల్సి ఉంది. కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిందే తడవుగా ఏ క్షణమైనా దోషులను ఉరి తీయవచ్చు. దోషుల క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించగానే కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియకు మహా అయితే నెల రోజులు పట్ట వచ్చంటున్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఇప్పుడు తీవ్ర టెన్షన్ కు గురవుతున్నారు. ఎందుకంటే దోషులను ఉరి తీసే తలారి లేకపోవడమే ఇందుకు కారణమట. ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం ఉరి తీసే తలారి కోసం తీహార్ జైలు అధికారులు వేట ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లో ఉరి తీసే తలారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సమాచార సేకరణ చేస్తున్నారు. అత్యంత అరుదైన కేసుల్లో మినహా ఉరి శిక్ష విధించకపోవడంతో పూర్తి స్థాయిలో తలారి నియామకం జరగలేదన్నది ఆ వార్తా సంస్థ కథనం. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో తలారి పోస్టు నియామకం ఈ జైల్లో జరగలేదంటున్నారు. ప్రస్తుత అవసరం దృష్ట్యా కనీసం కాంట్రాక్టు ప్రాతిపదికన ఎవరైనా తలారిని నియమించాలని యోచిస్తున్నారు. ఏదో ఓ ప్రాతిపదికన ఇప్పుడు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలుకు అర్జంటుగా తలారి కావాలి. జైలు అధికారుల అన్వేషణ ఫలించాలని ఆశిద్దాం.

Comments are closed.

Exit mobile version