‘యాపారమే లేదు… పేపర్ ఎందుకు? మడత కూడా విప్పే పరిస్థితి లేదు… షాపు షట్టర్ కిందే పేపర్లు పడి ఉంటున్నాయ్… ఏం లాభం… బంద్ చేయండి’ కరోనా వైరస్ కారణంగా ప్రింట్ మీడియాకు చెందిన పత్రికలను సరఫరా చేసే ఏజెంట్లకు, పేపర్ బాయ్స్ కు ఎదురవుతున్న ప్రశ్నలివి. కరోనా నేపథ్యంలో సంక్షోభం నుంచి తట్టుకోవడానికి పత్రికా యాజమాన్యాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, పత్రికల సరఫరాపై నీలి నీడలు కమ్మకుంటున్నాయి. కరోనా ప్రభావం వల్ల తెలుగు ప్రింట్ మీడియాలోని ప్రధాన పత్రికలు ఇప్పటికే పేజీల సంఖ్యను గణనీయంగా తగ్గించగా, చిన్న పత్రికల కేటగిరీలో గల సంస్థలు జిల్లా టాబ్లాయిడ్లను పూర్తిగానే ఎత్తేశాయి. ఈ పరిణామాల్లోనే పేపర్ ఏజెంట్లు, బాయ్స్ పత్రికల సరఫరాపై చేతులు ఎత్తేస్తున్నారు.

తెలంగాణాలోని ఓ ముఖ్య నగరంలో దశాబ్ధాల తరబడి ప్రధాన పత్రికల నుంచి, చిన్న పత్రికల వరకు సరఫరా చేసే ఓ ‘హాకర్’ కథనం ప్రకారం ప్రస్తుతం ప్రింట్ మీడియాకు అత్యంత గడ్డు కాలం. వాస్తవానికి గడచిన కొద్ది నెలలుగానే ప్రధాన పత్రికల సర్క్యులేషన్ కూడా గణనీయంగా పడిపోయింది. ఓ పత్రికకు ఈ నగరంలో 29 మంది ఏజెంట్లు ఉన్నారు. ఏడాది క్రితం దాదాపు 26 వేల పత్రికలను ఆయా ఏజెంట్లు సరఫరా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఏజెంట్ల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కానీ నగరంలో ఆ పత్రిక తాజా సర్క్యులేషన్ ఎంతో తెలుసా? కేవలం 11 వేలు మాత్రమే. ప్రింట్ మీడియాకు చెందిన పత్రికల పతనావస్థకు ఇది ఓ ఇండికేషన్ మాత్రమేనని సదరు హాకర్ నిర్వచనం. సరే పత్రికలన్నాక సర్క్యులేషన్ వ్యవహారాల్లో హెచ్చు, తగ్గులు సర్వసాధారణమే. ప్రతిష్ట నిలుపుకునేందుకు కొన్ని సంస్థల డంపింగ్ బాగోతాలు ఇందులో భాగమే కావచ్చు. కానీ…

కరోనా వైరస్ రూపంలో ప్రింట్ మీడియాకు చెందిన అన్ని పత్రికలకు ముప్పు పరిణమించింది. లాక్ డౌన్ కారణంగా పాన్ షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు అన్నీ బంద్. అత్యవసర సర్వీసులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. ఈ పరిస్థితుల్లో సరఫరా చేస్తున్న పత్రికలు షాపుల షట్టర్ల కింద నుంచి లోనికి వెడుతున్నాయే తప్ప, వాటిని తీసి తిరగేస్తున్నవారే లేరు. అదేవిధంగా ఇళ్లల్లోనూ పత్రికలను ముట్టుకోవడానికి జనం బెంబేలెత్తుతున్నారు. పత్రికలోని ఏ పేజీలో ఏ వైరస్ దాగి ఉందోనని భయంతో వణికిపోతున్నారు. దీంతో ఇళ్లల్లోపడిన పేపర్లను ముట్టుకోవడం లేదుట. పేపర్ బంద్ చేయాలనిఒకటే ఫోన్లు వస్తున్నాయని ఖమ్మం నగరంలో 20 మంది పేపర్ బాయ్స్ ను మెయింటెన్ చేసే ఏజెంట్ ఒకరు వెల్లడించారు.

తన వద్ద పనిచేసే పేపర్ బాయ్స్ లో అందరూ వివిధ షాపుల్లో గుమస్తాలుగా పనిచేసేవారేనని, ఉదయం పూట ఖాళీగా ఉండడం దేనికని పార్ట్ టైమ్ పేపర్ బాయ్స్ అవతారం ఎత్తుతున్నారని ఆయన చెబుతున్నారు. ఒక్కో పేపర్ కు రూ. 8 చొప్పున బాయ్స్ కు ఇస్తుంటారని, నెలంతా కష్టపడి 200 పత్రికలను సరఫరా చేసే బాయ్ కు గిట్టుబాటయ్యేది కేవలం రూ. 1,600 మాత్రమేనని ఆయన చెప్పారు. దీంతో కరోనా భయం తోడైందని, బాయ్స్ రావడం లేదన్నారు. అంతేగాక తమకు పేపర్ అవసరం లేదని ఇళ్లల్లో పత్రికలు తెప్పించుకునే వారి నుంచి ఫోన్లు వస్తుండగా, వ్యాపార సంస్థలకు చెందిన యజమానుల నుంచీ ఇదే పరిస్థితి ఎదురవుతోందంటున్నారు. లాక్ డౌన్ వల్ల తాము షాపులే తీయడం లేదని, వ్యాపారమే సాగనప్పుడు పేపర్ ఎందుకు? బిల్లు దండగ అంటున్నారని ఆ ఏజెంట్ వాపోయారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

అయితే ఇటువంటి ఉపద్రవాల సమయంలో తమ మనుగడకే ప్రమాదం ఏర్పడినప్పుడు ఎవరి పద్ధతుల్లో వారు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో అత్యదిక సర్క్యులేషన్ గల ‘ఈనాడు’ పత్రిక తనదైన శైలిలో ఈరోజు వార్తా కథనాలు వెలువరించడం విశేషం. కరోనా అంశంలో రకరకాల అపోహలను సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని వ్యాప్తి చేస్తున్నారని, ఇటువంటి క్లిష్ట సమయంలో పత్రికల్లో వైద్య నిపుణులు అందించే సమాచారమే కీలకమైని ఎంవీ రావు డాక్టర్ ను ఉటంకిస్తూ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. పత్రికల ద్వారా మాత్రమే విశ్వసనీయ సమాచారం పొందవచ్చని ఆయన సూచించినట్లు ప్రస్తావించింది. అంతేకాదు వార్తా పత్రికలతో కరోనా వ్యాపించదని అసోంకు చెందిన ప్రముఖ వైద్యుడు ఇలియాస్ ఆలీ పేర్కొన్నట్లు కూడా మరో కథనాన్ని ‘ఈనాడు’ ప్రచురించింది.

వెల్లుల్లి రసం, వేపాకు, సుగంధ ద్రవ్యాల గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అపోహలుగా డాక్టర్ ఎంవీ రావు చెప్పినట్లు పేర్కొన్న ఈనాడు ‘కరోనాను కట్టడి చేేసే సూపర్ ఫుడ్’ శీర్షికన కొద్ది రోజుల క్రితమే వసుంధర పేజీలో భారీ కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఉసిరి కాయలు, వేపాకు, తులసి, కమలాపండు రసం, అల్లం, తేెనె, మిరియాల రసం, పసుపు పాల గురిచి సోదాహరణంగా వివరించింది. ఆయా ‘సూపర్ ఫుడ్ ను మన ఫుడ్ మెనూలో భాగం చేసుకుందాం, కరోనాకు దూరంగా ఉందాం’ అంటూ ముక్తాయించింది.

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వ్యాధిని ప్రామాణికంగా చేసుకుని ఇద్దరు వైద్య ప్రముఖులు వార్తా పత్రికల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం, దాన్ని ‘ఈనాడు’ ప్రముఖంగా ప్రచురించడం వెనుక దాగి ఉన్న మర్మమేమిటో మీకు అర్థమవుతున్నట్లే కదా…?

Comments are closed.

Exit mobile version