ఓ విందు కార్యక్రమం పోలీసు శాఖకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పై వేటుకు దారి తీసింది. ‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సీఐ అబ్బయ్య సోమవారం సుమారు 200 మందికి స్థానిక కెమిలాయిడ్స్ గెస్ట్ హౌజ్ లో విందు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కట్టడి విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి భోజనాల పేరుతో ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతూ ఆహ్వానించారట.

అయితే వాస్తవానికి సీఐ అబ్బయ్య వినాయకపురంలోని చిలకలగండి ముత్యాలమ్మ తల్లికి యాటపోతును కోసి మొక్కు చెల్లించుకున్నారనే విషయం పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ‘కరోనా’ వైరస్ నిరోధక కమిటీ సభ్యుడైన సీఐ అబ్బయ్య సుమారు 200 మందిని ఒకేచోటకు ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేయడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీంతో సీఐ అబ్బయ్యను కొత్తగూడెం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వారావుపేట ఇంచార్జి సీఐగా రాజగోపాల్ అనే అధికారిని నియమించారు. అబ్బయ్యను జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన మాట వాస్తవమేనని కొత్తగూడెం ఎస్పీ కార్యాలయ అధికార వర్గాలు ధృవీకరించాయి. ‘కరోనా’ వైరస్ అంశం నేపథ్యంలో ఇదే జిల్లాలోని ఓ డీఎస్పీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version