కొందరు మీడియా ప్రతినిధుల ‘అతి’ కారణంగా జరిగే అనర్థాలకు ఇదో మచ్చు తునక. జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడు ‘ఖల్’మంటూ దగ్గిన పాపానికి అతన్ని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వరకు తరలించిన మీడియా ‘అతి’ గురించి నిన్నగాక మొన్ననే వార్తా కథనాలుగా చదువుకున్న సంగతి తెలిసిందే. ts29.in ఆకాంక్షించిన విధంగానే సదరు యువకుడికి కరోనా వైరస్ టెస్టుల్లో ‘నెగిటివ్’ నివేదిక రావడం గమనార్హం.
దుబాయ్ నుంచి ఇటీవల జనగామ జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుని విషయంలో కొందరు మీడియా ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ అతన్ని హుటాహుటిని గాంధీ ఆసుపత్రికి తరలించింది. అతనితోపాటు తొమ్మిది కుటుంబ సభ్యులను కూడా వైద్య సిబ్బంది గాంధీ ఆసుపత్రిలోని కరోనా ఐసొలేషన్ వార్డుకు తరలించారు.
అయితే గాంధీ ఆసుపత్రిలో ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో సదరు యువకుడికి కరోనా వైరస్ ‘నెగిటివ్’ రిపోర్ట్ రావడం విశేషం. దగ్గు వస్తోందని ఆసుపత్రికి వెళ్లినందుకే అతన్ని కరోనా వైరస్ సోకిన వ్యక్తిగా ప్రచారంలోకి తీసుకువచ్చి అతి చేసిన మీడియా ప్రతినిధులు సమాధానం చెప్పాల్సిన అవసరముందని అంటున్నారు. ఎందుకంటే మీడియాగా చెప్పుకునే కొందరి ‘అతి’ వల్లే ఎల్లమ్మ పండుగకు కూడా నోచుకోని ఆ దుబాయ్ యువకుని కుటుంబం మీడియా మొత్తాన్ని వేలెత్తి చూపుతోంది మరి!
ఇవీ చదవండి:
నిగ్గదీసి అడిగెయ్… ఇంకా కడిగెయ్… ఈ సిగ్గులేని మీడియాను…!
‘పుకార్ షికార్’ అంటే ఇదే మరి! జనగామలో ఏం జరిగిందంటే?!