‘చెప్పంగ ఇననోన్ని చెడంగ జూడాలె’ అనేది తెలుగు సామెత… ముఖ్యంగా తెలంగాణాలో విరివిగా వినియోగించే నానుడి. సామెతలో దాగి ఉన్న కథ కాస్త ముతక బాపతే అయినప్పటికీ సందర్భానుసారం చర్చించుకోక తప్పని సంగతి ఇది. ఎన్ఆర్ఐలు ఎవరైనా అమెరికా అధ్యక్షుడు ట్రంపుతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటే తప్పక వినిపించాల్సిన కథ. ట్రంపు కూడా తెలుసుకోవలసిన ఆసక్తికర కథనం కూడా.
ఇంతకీ కథ ఏమిటంటే… ఓ మనవడు అనువుగానిచోట, అసందర్భంగా దోసకాయ తింటుంటాడు. దాన్ని చూసి ఆ పిల్లోడి తాత ‘అషిద్దం రా పిలగా… అలా తినొద్దు అంటాడు. నా ఇష్టం… నేను ఇలాగే తింటాను. ఎక్కువగా మాట్లాడితే అషిద్ధంలో దోసకాయను అద్దుకుని మరీ తింటా… ఏం చేస్తావ్?’ అని ప్రశ్నిస్తాడు. తాత మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. నిర్ఘాంతపోయి భుజాన గల తువ్వాలు తీసి నోర్మూసుకోవలసిందే. కథను సాగదీసి కూడా చెప్పవచ్చుగాని, క్లుప్తంగా దాని సారాంశం ఇంతే.
ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే… అగ్రరాజ్య పెద్దన్న ట్రంపు గురించి తెలిసిందే కదా? కరోనా వైరస్ విషయంలో ఆయన ఎవరి మాటా విన్నట్లు లేదు. తాను చెప్పిందే ప్రపంచానికి వేదమన్నట్లు వ్యవహరిస్తుంటారు. తాజాగా ట్రంప్ కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రి నుంచి అత్యంత వేగంగా వైట్ హౌజ్ కు చేరుకున్నారు కూడా. కానీ తన మూతికి గల మాస్కును తీసి మరీ లేటెస్టుగా ఫొటోలకు ఫోజులివ్వడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నారు. మాస్కు ధరించడం తనకు ఇష్టముండదని ట్రంప్ గతంలోనూ పలు సందర్భాల్లో ప్రకటించారు.
ఆయన మాస్కు ధరించడం మాట సంగతేమోగాని వైట్ హౌజ్ లో గల మెలానియాతోపాటు పలువురు స్టాఫ్ కు కూడా కరోనా సోకిందట. ఈ నేపథ్యంలోనే అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచికి ఓ ప్రశ్న ఎదురైంది. ‘కరోనా మహమ్మారి అభూత కల్పనగా విశ్వసించే మొండివాడితో దాని నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి?’ అని అమెరికన్ యూనివర్సిటీస్ కెన్నడీ పొలిటికల్ యూనియన్ చేసిన ఇంటర్వ్యూలో ఫౌచికి ఈ ప్రశ్న ఎదురైంది.
అందుకు ఫౌచి ఇచ్చిన సమాధానం ఏమింటో తెలుసా? ‘ ఈ వారం వైట్ హౌజ్ ను చూడండి. అక్కడ జరుగుతున్నది వాస్తవం. ఏరోజుకారోజు కరోనా బారినపడేవారి సంఖ్య పెరుగుతుంటుంది. ఇది అభూత కల్పన కానే కాదు. వాస్తవిక, దురదృష్టకర పరిస్థితి. ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చు కూడా’ అని ఫౌచి చెప్పారు. మాస్కులు ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థంగా నిలువరించవచ్చని ఫౌచి మొదటినుంచీ చెబుతున్నారు. ఆయన సూచనలను, సలహాలను ట్రంప్ బేఖాతర్ చేశారు. ఎప్పడో ఒకప్పుడు మాత్రమే ట్రంప్ మాస్క్ ధరించేవారని, కరోనా బారినపడి ఆసుపత్రి నుంచి వైట్ హౌజ్ కు వచ్చాక కూడా ట్రంపు వైఖరిలో మార్పు రాలేదంటున్నారు. ఎక్కువ సేపు మాస్కు ధరించకపోగా, వైరస్ సోకిన తర్వాత సైతం మాస్కు తీసేసి ఫొటోలకు ఫోజులిచ్చిన తీరు తెలంగాణా నానుడి ‘దోసకాయ కథ’ను గుర్తుకు తీసుకురావడం లేదూ!