అదేంటో గానీ… విదేశీ నేతలు మనదేశంలో పర్యటిస్తున్నారంటే మొదటి దెబ్బ పడేది పేదవాళ్ళపైనే. రోడ్ల వెంట ఉండే పేదల గుడిసెలు కూలిపోతాయి. ‘మాదేశంలో పేదలు ఉన్నారు’ అని చెప్పుకోడానికి మన నేతలు సిగ్గు పడతారేమో!
పేదరిక నిర్మూలనకు వచ్చిన అనేక పథకాలు ఈ డెబ్బయ్యేళ్ళ స్వతంత్ర భారత దేశంలో పాలకులను ధనవంతులను చేశాయి. అధికారులను ధనవంతులను చేశాయి. కాంట్రాక్టర్లను, బ్రోకర్లను ధనవంతులను చేశాయి. పేదలు మాత్రం అలాగే ఉండిపోయారు.
దేశ రాజధానిలోనో, రాష్ట్ర రాజధానిలోనో పేద ప్రజలకోసం విడుదలయ్యే ప్రతి వంద రూపాయల్లో తొంభయ్ రూపాయలు రాజకీయ నాయకులూ, అధికార్ల చేతులు తడపడానికే సరిపోతున్నాయి. మిగిలిన ఆ పది రూపాయలు కూడా అందిపుచ్చుకోడానికి ఆ పేదోడు పడే వేదన, పట్టుకునే కాళ్ళు, కార్చే కన్నీళ్ళు, అరిగిపోయే కాళ్ళ జోళ్ళ లెక్కే లేదు. ఆపాటికే ఆ పేదోడిని ఉద్ధరించేసినట్టు నేతలూ, అధికారులు జబ్బలు చర్చుకొని, చప్పట్లు కొట్టుకొని ఆనందిస్తుంటారు.
అప్పుడెప్పుడో పాదచారులకోసం రోడ్డువెంట చెట్లు నాటాడు అశోకుడు. ఈ మధ్యకాలంలోనే ‘గరీబీ హఠావో’ (పేదరిక నిర్ములన) నినాదం ఇచ్చింది ఇందిరా గాంధీ. ఇన్నేళ్ళకు, ఇప్పుడు మన నవయుగ వైతాళికుడు, భరతమాత ముద్దుబిడ్డ ‘పేదలు కనిపించకుండా ఏకంగా గోడ కట్టేశాడు.’ రేపెప్పుడో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వచ్చినప్పుడు పేదలు, పేదల గుడిసెలు కనిపించకుండా ఇలా గోడ కట్టేసి మసిపూసి మారేడుకాయ చేశాడు.
ఏమైతేనేం, పేదల్ని అక్కడినుండి తొలగించకుండా, వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డున పడేయకుండా రోడ్డు పొడవునా గోడ కట్టేశాడు. అంతవరకూ అది ఆ మహానుభావుడు ఆ పేదలకు చేసింది మేలే!. గుడిసెలు పీకేసి ‘ఊరుబయటకు పోండి’ అని తరిమేయలేదు!
-దారా గోపి