మా అమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటారు తెలుసా? మా అమ్మాయికి ఫారిన్ సంబంధాలు చూస్తున్నాం…అని కొందరు మురిసిపోతుంటారు… తెలుసు కదా? అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డలకు విదేశీ సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తే, అక్కడి అల్లుళ్లపై ఎంత భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయో మీరే చూడండి. గడచిన మూడున్నరేళ్ల కాలంలో ఫారిన్ భర్తల అరాచకాలకు సంబంధించిన నివేదికను విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. విదేశాల్లోని భారతీయ మహిళలకు రక్షణ కల్పించే లక్ష్యంతో సుష్మా స్వరాజ్ హయాంలో తీసుకువచ్చిన చట్టం అనంతరం ఎన్నారై భర్తలపై నమోదైన ఫిర్యాదులు అక్కడి మహిళల ఇబ్బందుల తీవ్రతను వెల్లడిస్తున్నాయి. గృహ హింస, వరకట్నం వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సుష్మా స్వరాజ్ ఈ హయాంలో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించిన వివరాల ప్రకారం… 201 జనవరి నుంచి 2019 అక్టోబర్ వరకు విదేశీ భర్తల అరాచకాలపై 6,000 మందికి పైగా మహిళలు ఫిర్యాదు చేశారు. తాము ఎన్నారై భర్తల చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదులు అందాయని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి మొత్తం 991 ఫిర్యాదులు వచ్చాయి. గడచిన నాలుగేళ్లలో వచ్చిన ఫిర్యాదులను వరుసగా పరిశీలిస్తే… 2018లో 1,299, 2017లో 1,498, 2016లో 1,510, 2015లో 796 మంది ఎన్నారై భర్తల కారణంగా తాము మోసపోయినట్లు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. మరో 77 మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారని, వీరిలో 73 మందిని తిరిగి ఇండియాకు రప్పించినట్లు నివేదిక వెల్లడించింది. ఒకరు చనిపోగా, మరో ముగ్గురు భారతీయులు ఇంకా బందీగానే ఉన్నారు. వారిని కూడా త్వరలోనే స్వదేశానికి తీసుకువస్తామని మంత్రి మురళీధరన్ వివరించారు. అదేవిధంగా గత నాలుగేళ్లలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల్లో చనిపోయిన భారతీయుల(వలస కార్మికులతో సహా) వివరాలను కూడా మంత్రి ప్రకటించారు. 2019లో (అక్టోబర్ వరకు) 4,823 మంది చనిపోగా, 2018లో 6,014, 2017లో 5,906, 2016లో 6,013, 2015లో 5,786 మంది చొప్పున అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, ఇతర సమస్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి మురళీధరన్ వివరించారు. ఎన్నారై భర్తలందరినీ ఒకే గాటన కట్టడం కాదుగాని, విదేశీ సంబంధాలే ప్రామాణికంగా తీసుకునేవారు ఒకటికి వందసార్లు చెక్ చేసుకోవలసిన అవశ్యకతను ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.