వేసవి కాలం సమీపించిందంటే వన్యప్రాణులు దాహార్తితో విలవిలలాడుతుంటాయి. చుక్క నీరు దొరక్క దిక్కులన్నీ అన్వేషిస్తుంటాయి. అడవుల్లోని వాగులు, వంకలు ఎండిపోయిన పరిస్థితుల్లో అనేక రకాల వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతుంటాయి. గుక్కెడు నీటి కోసం అన్వేషణ సాగిస్తూ అటవీ గ్రామాల్లోకి వచ్చే దుప్పులు, జింకలు తదితర వన్యప్రాణులను ఊరకుక్కలు చంపేస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో వేటగాళ్ల బారిన కూడా పడుతుంటాయి. ఇటువంటి ఘటనలు అటవీ గ్రామాల్లో ఏటా సర్వసాధారణమే.

కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం వన్యప్రాణులు సరికొత్త రీతిలో ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయి. దాదాపు 15 రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్ హౌజ్ గ్రావిటీ కెనాల్ వద్దకు దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ దుప్పి అందులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో నాలుగు దుప్పులు శనివారం ఇదే కాల్వలో పడ్డాయి. ప్రమాదంలో చిక్కుకున్న దుప్పులను స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నాలుగింటిలో మూడింటిని అటవీ సిబ్బంది రక్షించగా, ఓ దుప్పి నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక అప్పటికే మరణించింది. ప్రాథమిక చికిత్స అనంతరం ప్రాణాలతో దక్కిన మూడు దుప్పులను అడవుల్లో వదిలేశారు. వేసవి నేపథ్యంలో ఇటువంటి కాల్వల వద్దకు వచ్చే వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకోవలసిన అవసరముంది.

Comments are closed.

Exit mobile version