తెలంగాణా ఎన్జీవోస్ వర్గాల్లో కలకలం కలిగించే అంశమిది. ఖమ్మం జిల్లాకు చెందిన 16 మంది టీఎన్జీవో హౌజింగ్ సొసైటీ కమిటీలోని 16 మంది కీలక సభ్యులపై భూకబ్జా కేసుల నమోదుకు సిఫారసు చేస్తున్నట్లు ఖమ్మం ఇంచార్జి ఆర్టీవో సూర్యనారాయణ వెల్లడించారు. ఖమ్మం టీఎన్జీవో హౌజింగ్ సొసైటీలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నలుగురు సభ్యుల విచారణ కమిటీ తేల్చిందన్నారు. ఆయా అక్రమాల నేపథ్యంలోనే కేసుల నమోదుకు విచారణ కమిటీ సిఫారసు చేసిందన్నారు.
ఖమ్మం అర్బన్ మండలంలో 4.13 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 4.26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్నారు. మొత్తంగా 8.39 ఎకరాలు టీఎన్జీవో సొసైటీలో కబ్జాకు గురైందని చెప్పారు. ఈ సొసైటీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయని, ఆయా కమిటీల్లోని 16 మంది కీలక సభ్యులపై క్రిమినల్ కేసుల నమోదుకు కమిటీ సిఫారసు చేసినట్లు ఆర్డీవో సూర్యానారాయణ వివరించారు. ఈమేరకు ఖమ్మం టూ టౌన్, ఖమ్మం రూరల్ పోలీసులకు కేసుల నమోదు కోసం సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలు టీఎన్జీవో వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.