తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఇప్పటికే ఒక ప్రధానమైన పంట.దీనిని వచ్చే వానాకాలం సీజన్ లో 70 లక్షల ఎకరాలలో సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మా రైతు స్వరాజ్య వేదిక అభిప్రాయాలు… అన్ని గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణలో రైతులకు పత్తి పంట చాలా రిస్క్ తో కూడి ఉంటుంది. ఖర్చులు, ధరల ప్రకారం పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత పత్తి సాగును పెంచాలని చూడడం ఆత్మహత్యా సదృశ్యం..
2019 ఖరీఫ్ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) మించి ఈ సంవత్సరం మరో 2 శాతం ఎక్కువ సాగయింది.
మొత్తం సాధారణ పంటసాగు విస్తీర్ణం తెలంగాణాలో 43,34,487 హెక్టార్లు కాగా, అందులో 40 శాతం విస్తీర్ణంలో పత్తే సాగవుతున్నదంటే ఈ పంటకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో పంట సాగు భూములు లేవు. మిగిలిన 32 జిల్లాలకుగాను, మేడ్చల్ తప్ప, మిగిలిన 31 జిల్లాలలోనూ పత్తి సాగవుతున్నది. అన్ని రకాల భూములలోనూ పత్తిని సాగు చేస్తున్నారు. నీటి పారుదల సౌకర్యాల కిందే కాకుండా, వర్షాధార భూములలోనూ పత్తి పంట సాగు చేస్తున్నారు. దీనివల్ల ఆయా జిల్లాలలో సగటు దిగుబడుల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి.
పత్తి సాగు విస్తీర్ణం పెరగడంపై రైతు స్వరాజ్య వేదిక చేసిన ఒక అధ్యయనం ప్రకారం, పత్తి సాగుకు బ్యాంకులు అందించే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ప్రస్తుతం హెక్టారుకు 87,500 రూపాయలు) కూడా ఒక ప్రధాన కారణమని అర్థం అయింది. అలాగే రాష్ట్రంలో కోతులు, అడవి పందుల వల్ల ఇతర పంటలు సాగు చేసే పరిస్థితి లేదనీ, ఈ జంతువులు పత్తి జోలికి రావుగనుక ఈ పంటను సాగు చేస్తున్నామనీ రైతులు చెప్పారు. వాస్తవానికి తాజా పరిస్థితులలో కోతులు, ఒక దశలో పత్తి కాయలను చెట్ల నుంచి తెంచి, కొరికి పడేస్తున్నాయని రైతులే చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులను, ఒక మేరకు పత్తి తట్టుకుంటుందనీ, మిగిలిన పంటలు తట్టుకోలేవనీ రైతుల అభిప్రాయం. పత్తిలో కనీస దిగుబడి తప్పకుండా వస్తుందని, పైగా పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్లలో పత్తి చేతికి వస్తుంది కనుక, రైతుల డబ్బు అవసరాలను తీరుస్తుందని, పత్తికి మార్కెటింగ్ వ్యవస్థ గ్రామ స్థాయి వరకు విస్తరించి ఉందని, మిగిలిన ఏ పంటకు ఇంత గ్యారంటీ లేదని, అందుకే పత్తిని సాగు చేస్తున్నామని రైతుల అభిప్రాయం.
దేశ వ్యాప్తంగా పత్తి పంట సాగు, వినియోగం వివరాలు పరిశీలిస్తే… పత్తి ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతులు ప్రస్తుతం బేలన్స్ అవుతున్నవి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి విస్తీర్ణం, దిగుబడులు, ధరలు కూడా భారతదేశ మార్కెట్‌ను, రైతులను ప్రభావితం చేస్తున్నాయి. మన మిల్లుల అవసరాలను ప్రస్తుత పత్తి ఉత్పత్తి తీర్చగలుగుతున్నప్పటికీ, ఎగుమతులలో స్థబ్ధత వుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్లో పత్తి తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు, భారత మిల్లుల యాజమానులు కూడా, పత్తి దిగుమతుల కోసం పరుగులెత్తుతున్నారు. లేదా భారతదేశ మార్కెట్లో పత్తి ధరలను పడేస్తున్నారు. ఫలితంగా రైతులు, కేవలం వర్షాభావ పరిస్థితులలో దిగుబడులు తగ్గి మాత్రమే కాకుండా, పత్తి బాగా పండిన సందర్భాలలో కూడా రైతులకు ధరలు అందక నష్టపోతున్నారు.
పత్తి పంటకు సంబంధించి సి.ఎ.సి.పి నివేదికలో మరికొన్ని అంశాలు మనం పరిశీలించాలి. 2019-20 సంవత్సరానికి కనీస మద్ధతు ధరలను ప్రకటించడానికి సాధారణంగా సి.ఎ.సి.పి. 2015-16, 2016-17 సంవత్సరాల ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నది. ఈ నివేదిక ప్రకారం పత్తి పంట హెక్టారు ఉత్పత్తి ఖర్చు 2015-16లో 73,661.72 రూ.లు కాగా, అది 2016-17కు 83,117.08 రూ.లకు (అంటే హెక్టారుకు 10 వేల రూపాయలు) పెరిగింది.
కానీ సగటు దిగుబడుల విషయానికి వస్తే 2015-16లో హెక్టారుకు 14.52 క్వింటాళ్ళు కాగా, 2016-17లో అది 18.29 క్వింటాళ్ళకు పెరిగింది. ఫలితంగా పంట సాగు ఖర్చు (ఎ2) + కుటుంబ శ్రమ విలువ (ఎఫ్.ఎల్) కలిపి 2015-16లో క్వింటాలుకు 3,633.23 కాగా 2016-17లో క్వింటాలుకు 2,935.34 రూపాయలకు పడిపోయింది. సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) క్వింటాలుకు 5,067.31 రూపాయల నుండి 4,544.69 రూపాయలకు పడిపోయింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంట సాగు వివరాలు. తెలంగాణా రాష్ట్ర వివరాలు సి.ఎ.సి.పి. నివేదికలో లేవు. దేశ ఉత్పత్తిలో 14 శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణా రాష్ట్ర పత్తి పంట వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సి.ఎ.సి.పి.కి అందించడం లేదో మనకు అర్థం కాదు. దాని వల్ల మొత్తంగా మద్ధతు ధరలు పొందడంలో పత్తి రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవం.
✍️ కన్నెగంటి రవి