ఇష్టపడి పెంచుకున్న చేతులే నిర్దాక్షిణ్యంగా అసువులను తుంచేస్తున్నాయి. రక్షణగా ఉంటాయని పెంచుకున్న పెంపుడు జంతువులను ప్రస్తుతం చైనాలో అంతస్తుల నుంచి కిందకు తోసేస్తున్నారు. స్థానిక ప్రసార మధ్యమాల తలతిక్క రిపోర్టింగ్ వల్ల, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పెంచిన చేతులతోనే పెంపుడు జంతువులను అపార్ట్మెంట్ల నుంచి కిందకు తోసేస్తున్నారు. కరోనా వైరస్ కల్లోలంతో ప్రాణాలను ‘మాస్క్’ మాటున పెట్టుకుని బతుకుతున్న చైనాలో తాజా పరిస్థితి ఇది.
ఇంతకీ విషయం ఏమిటంటే..కరోనా వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లి, వచ్చిన జంతువులను క్యారంటైన్లో ఉంచాలని అక్కడి వైద్యులు సూచించారట. ఈ విషయంపై స్థానిక మీడియాలో మరో విధంగా ప్రచారమైందట. దీంతో పెంపుడు జంతువుల వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తోందని బెంబేలెత్తిన చైనీయులు ఎంతో ప్రీతిపాత్రంగా పెంచుకున్న కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులను నిర్దాక్షిణ్యంగా అపార్ట్మెంట్ల అంతస్తుల పైనుంచే కిందకు తోసేస్తున్నారుట. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమై నిజా నిజాలు తెలుసుకోవాలని, ఇళ్లల్లో పెంచుకునే జంతువుల వల్ల కరోనా వ్యాధి సోకుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిందట. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందట. ఇంకా జరుగుతూనే ఉందట. ఇష్టంగా పెంచుకున్నవారే అంతస్తుల పైనుంచి తోసేసిన పరిస్థితుల్లో నోరులేని ఆ మూగ జీవాలు తుది శ్వాస విడుస్తున్నాయట. విషాదమేంటంటే… ఈ భూమ్మీద బతికే హక్కు తమకు ఎంత ఉందో… మిగతా ప్రాణులకూ అంతే ఉందని ‘కరోనా’ వైరస్ కల్లోల పరిస్థితుల్లోనూ చైనీయులు గుర్తించకపోవడం.