అగ్రరాజ్యం అమెరికాలోనేగాక, బ్రిటన్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రాగల 24 గంటల్లో దాదాపు మరో 82 వేల మంది అమెరికాలో చనిపోయే అవకాశం ఉన్నట్లు అక్కడి వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. చనిపోతారని ఆయా సంఖ్యను అంచనా వేయడానికి బుధవారం నాటి కరోనా పరిణామాలే ప్రధాన కారణం. ఈ ఒక్కరోజులోనే అమెరికాలో 3,903 మందిని కరోనా పొట్టనపెట్టుకోగా, 1.25 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ పరిస్థితిని బట్టి రాగల 24 గంటల్లో దాదాపు 82 వేల మంది కరోనాకు బలయ్యే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటడం వరుసగా 29వ రోజు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి 23వ తేదీ నాటికి 3.83 లక్షల నుంచి 4.24 లక్షల మంది మరణించే అవకాశం ఉందని సీడీసీ అంచనా వేసింది. ఒక్క లాస్ ఏంజిల్స్ కౌంటీలోనే బుధవారం నాటికి కరోనా మరణాల సంఖ్య పదివేలను దాటిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా బ్రిటన్లోనూ బుధవారం ఒక్క రోజే కరోనా బారిన పడిన బాధితుల్లో 981 మంది మరణించారు. ఇదేరోజు యాభై వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత బుధవారం నాటితో పోలిస్తే దేశంలో కరోనా మరణాల సంఖ్య 31 శాతం పెరిగింది. గత బుధవారం నాడు 744 మంది కరోనాతో మరణించగా, కేసుల సంఖ్య కూడా గత వారంతో పోలిస్తే 27 శాతం పెరిగింది. గత బుధవారం 39,237 కరోనా కేసులు నమోదు కాగా, ఈ బుధవారంనాటికి బాధితుల సంఖ్య 50,023కు చేరింది. బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వల్ల కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని వైద్యాధికారులు భావిస్తున్నారు. మొత్తంగా కొత్త సంవత్సర వేళ కరోనా విలయం అమెరికా, బ్రిటన్ దేశాలను వణికిస్తోంది.