పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజే ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయడంతో పార్లమెంటు దద్దరిల్లింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లోపల, బయటా టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పార్లమెంటు ప్రాంగణంలో నినాదాలు మిన్నంటాయి.

పార్లమెంటు ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంపీలు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్ల కార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టతనివ్వని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ మేరకు పార్లమెంటు సమావేశాల తొలిరోజైన సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై తమ పోరాటానికి పదునుపెట్టారు. ఎంపీల నిరసనల్లో భాగంగా ‘రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి..’ అంటూ పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.

తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ముందుచూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందటం వల్ల దిగుబడులు పెరిగాయని, ఆ మేరకు ఎఫ్ సి ఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శవంతమైన, రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు అవుతున్నాయని గుర్తుచేశారు. దేశంలోని రైతాంగానికి కావాల్సిన ప్రోత్సాహకాలు, సంక్షేమం గురించి కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

ఉభయసభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రధానంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని టీఆర్ఎస్ పట్టుబట్టింది. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, నిరసనలతో లోక్ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే క్రమంలో ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. కాగా పార్లమెంట్లో తొలిరోజే ప్రశ్నోత్తరాల సమయం మొదలు కాగానే ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ బిర్లా సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం లోక్ సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలు రైతు బిల్లు, ధాన్యం కొనుగోళ్లపై చర్చకు పట్టుపట్టడంతో సభలో మరోమారు గందరగోళం నెలకొంది. దీంతో ప్యానల్ స్పీకర్ లోక్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Comments are closed.

Exit mobile version