స్కూల్ ఎగ్గొట్టడానికి చిన్న పిల్లలు ఏం చేస్తారు? రకరకాల కారణాలు చెబుతుంటారు. కడుపు నొప్పిఅనో, కాలు నొప్పి అనో చెప్పి స్కూల్ కు వెళ్లడం తప్పించుకుంటుంటారు. లేదంటే మా సార్ ఈ రోజు స్కూల్ కు రావడం లేదంటారు. ఇంకొందరు గడుగ్గాయిలు ఫలానా టీచర్ కు ఏదో అయిందంటూ నకిలీ కబుర్లు చెప్పి బడికి ఎగనామం పెడతారు. ఇవి ఇళ్ల దగ్గర చెప్పే సమాధానాలు. స్కూల్లో చెప్పే కారణాలు వేరే ఉంటాయి. నిన్న బడికెందుకు రాలేదని టీచర్ ప్రశ్నిస్తే, మా మమ్మీ బట్టలు ఉతకలేదనో, నాన్న ఊళ్లో లేడనో రకరకాల సమాధానాలు చెబుతుంటారు. ఇంకొందరయితే పిల్లలయితే ఇంట్లోని ముసలాళ్లను కూడా తమ అవసరార్థం చంపేస్తుంటారు. ఈ చిన్న పిల్లల గోలేంటి అని విసుక్కోకండి. పిల్లలే కాదు ఏకంగా ఓ ప్రొఫెసర్ తన సెలవు కోసం పేర్కొన్న కారణం తెలిస్తే మీరూ షాక్ లోకి వెళ్లాల్సిందే.

ప్రొఫెసర్ జహీర్ సయీద్ రాసిన లీవ్ లెటర్ ఇదే

మహారాష్ట్రలోని చంద్రాపూర్ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో గఢ్ చందూర్ అనే ఊళ్లో ఓ కాలేజీ ఉంది. అందులో జహీర్ సయీద్ అనే ఒకాయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంటాడు. ఉన్నట్టుండి తనకు సెలవు కావాలంటూ కాలేజి ప్రిన్సిపల్ కు దరఖాస్తు చేసుకున్నాడు…అదేనండీ… లీవ్ లెటర్ ఇచ్చాడు. ప్రొఫెసర్ ఇచ్చిన లీవ్ లెటర్ ను చదివిన ప్రిన్పిపల్ కు మూర్ఛ వచ్చినంత పనైంది. ఆ లీవ్ లెటర్లో ఏముందనేగా మీ ప్రశ్న. చదివితే మీరూ నివ్వెరపపోక తప్పదు మరి. మహారాష్ట్రలో అర్థరాత్రిపూట అత్యంత వేగంగా మారిన రాజకీయ పరిణామాల సమీకరణలకు ఆ ప్రొఫెసర్ షాక్ కు గురయ్యాడట. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలను చూసి తాను అస్వస్థతకు గురయ్యానని, షాక్ లోకి వెళ్లిపోయానని, ఈ షాక్ నుంచి తేరుకోవడానికి తనకు సెలవు కావాలని జహీర్ సయీద్ తన సెలవుకు కారణాలుగా లీవ్ లెటర్లో చూపారు. లేఖను ఆసాంతం చదివిన ప్రిన్సిపల్ తానూ షాక్ కు గురై సెలవు ఇవ్వడానికి నిరాకరించారట. జహీర్ సెలవు చీటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఉద్యోగస్తులైతే సెలవు కోసం మరీ చిన్న పిల్లల్లా కారణాలు వెతుక్కోకండి…కాస్త జహీర్ తరహాలో వినూత్నంగా ఆలోచించండి.

Comments are closed.

Exit mobile version