చూశారుగా…? తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున అధికారికంగా వెలువడిన ప్రకటన ఇది. ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందనేది ప్రకటనలోని సారాంశం. ఈ సమావేశానికి ఆ పార్టీ చీఫ్, రాష్ట్ర సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, పల్లె నుంచి పట్నం వరకు కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ, సంస్థాగతంగా ఇతరత్రా అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చిస్తారని కూడా ఎజెండా క్లియర్ గానే ఉంది.
కానీ ఇప్పుడీ ప్రకటనపై మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నెన్నో సందేహాలతో కూడిన వార్తా కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తుండడమే అసలు విశేషం. మంత్రి ‘కేటీఆర్ సీఎం’ అంటూ ఏడాదికి పైగా సాగుతున్న ప్రచారం నేపథ్యంలోనే ఈ ప్రకటన కూడా తాజాగా సరికొత్త వార్తా కథనాలకు దారి తీసింది. జర్నలిజంలో దశాబ్ధాల అనుభవం గల జర్నలిస్టులు కూడా పలు ప్రశ్నలను లేవనెత్తుతూ సోషల్ మీడియాలో పోస్టులు వదులుతుండడం విశేషం. ఆయా పోస్టుల, వార్తా కథనాల్లోని ప్రశ్నలు ఏమిటంటే…?
ఏప్రిల్ 27 న జరగవలసిన పార్టీ ప్లీనరీ గురించి ఇంత త్వరగా సన్నాహాలు ఎందుకు చేస్తున్నట్లు?
పార్టీ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను మూడు నెలల ముందు ప్రారంభించవలసిన అవసరం ఏమొచ్చింది?
ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ ఏదేని స్పష్టత ఇవ్వనున్నారా?
లేదంటే తన స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ ముగింపు చెప్పనున్నారా?
పార్టీ స్థాపించిన 2001 నుంచి ఉద్యమం, 2014 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలతో తాను బాగా అలసిపోయినందున ఇక విశ్రాంతి కోరుకుంటున్నట్లు కేసీఆర్ బాహాటంగా వెల్లడించనున్నారా?
తన రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్ అప్పగిస్తున్నట్లు కేసీఆర్ చెప్పదల్చుకున్నారా?
తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేసేందుకు అవసరమైన మార్గాన్ని సుగమం చేయడానికి ఈ సమావేశాన్ని కేసీఆర్ ఉపయోగించుకునే అవకాశం ఉందా?
సంస్థాగతంగా పార్టీలో కేటీఆర్ పట్ల విశ్వాసం ఎలా ఉందనే అంశంపై సీఎం కేసీఆర్ అంచనా వేయనున్నారా?
సీఎం మార్పునకు సంబంధించి ఊహాగానాలు, వదంతులకు తెర దించుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు కేసీఆర్ స్పష్టం చేయనున్నారా?
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ విషయంలో పార్టీ వైఖరిని కేసీఆర్ కుండబద్దలు కొట్టనున్నారా?
ఇదిగో ఇలా సాగుతున్నాయ్ అనేక ప్రశ్నలు. కానీ ఈ తరహా సంశయాలపై టీఆర్ఎస్ వర్గాలు పెదవి విరుస్తుండడమే అసలు విశేషం. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ‘కేటీఆర్ కు పట్టాభిషేకం’ ప్రస్తావనే రాకపోవచ్చంటున్నారు. ఇది పార్టీ ప్లీనరీకి ముందు నిర్వహించే ‘గేర్ అప్’ లాంటి సమావేశం మాత్రమేనని అంటున్నారు. ప్రస్తుత నాయకత్వాన్ని ‘రెన్యువల్’ చేసేందుకు మాత్రమే ఈ సమావేశం లక్ష్యంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మంచి ముహూర్తాలు’ను బలంగా విశ్వసిందే సీఎం కేసీఆర్ మూఢాల్లో తన వారసుని పట్టాభిషేకంపై ఎలా నిర్ణయం తీసుకుంటారని సందేహిస్తున్నారు. మొత్తంగా పార్టీ సమవేశానికి సంబంధించిన ఓ పత్రికా ప్రకటన భిన్నసందేహాలకు, సరికొత్త ప్రచారానికి తావు కల్పించిందనేది కాదనలేని వాస్తవం.