కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన ఉత్తర్వు ఒకటి వివాదాస్పదంగా మారింది. ఈ ఉత్తర్వుపై ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. విషయంలోకి వెడితే… ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఆయన కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు.

కరీంనగర్ డీఈవో జారి చేసిన ఉత్తర్వు ప్రతి

అయితే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించే సభకు జనసమీకరణ బాధ్యతను ఉద్యోగులకు అప్పగిస్తూ డీఈవో జారీ చేసిన ఉత్తర్వు తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి హుజూరాబాద్‌ పర్యటనకు బస్సుల్లో ప్రజలను తరలించే బాధ్యతను ఎంఈవోలకు, జీహెచ్‌ఎంలకు, కోఆర్డినేటర్లకు అప్పగిస్తూ ఈ ఉత్తర్వు వెలువడడం గమనార్హం. ఆయా ఉద్యోగులను స్పెషల్‌ ఆఫీసర్లుగా పేర్కొంటూ మరో 150 మందిని రూట్‌ ఆఫీసర్లుగా నియమించుకోవాలని డీఈవో తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

సీఎం సభకు జనసమీకరణ, తరలింపు, కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించేదుకు శనివారం నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని కూడా ఉద్యోగ వర్గాలను డీఈవో ఆదేశించారు. ఈ ఉత్తర్వుపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం సభకు జనసమీకరణ బాధ్యతను ప్రభుత్వ టీచర్లకు అప్పగించడమేంటనే విమర్శలు వస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version