చాలా మంది గమనించి ఉండకపోవచ్చు. పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ఆమోదం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులతోపాటు టీడీపీ అధినేత ఆశ్చర్యకర రీతిలో ఓటు వేయడమే ఇక్కడ విశేషం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు, నిప్పుగా వ్యవహరిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు CAB బిల్లుకు మద్ధతునివ్వగా, తెలంగాణా సీఎం కేసీఆర్ అనూహ్య రీతిలో వ్యతిరేకించారు. గత ఎన్నికల అనంతరం ఏపీ రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటున్న రాజకీయ ప్రత్యర్థులైన జగన్, చంద్రబాబులు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు (కాబ్) కు ఒకే రీతిలో ఓటు వేయడం గమనార్హం. ఇదే సమయంలో ఎన్డీయే ప్రభుత్వానికి అవసరార్థ మిత్రునిగా వ్యవహరిస్తున్నట్లు ప్రాచుర్యం పొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కాబ్ బిల్లును వ్యతిరేకించడంపైనా రాజకీయ చర్చకు ఆస్కారం కలిగించింది. పార్లమెంటు ఉభయ సభల, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిన CAB ప్రస్తుతం చట్టం కూడా. ఈ కొత్త చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలకు చెందిన ముస్లింలు మినహా కాందీశీకులుగా వచ్చిన హిందువులు, క్రిష్టియన్లు, బౌద్ధులు, జైన్లకు పౌరసత్వం లభించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కాబ్ చట్టాన్ని తీసుకువచ్చింది.

వాస్తవానికి పౌర సత్వ బిల్లు అంశంలో జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓటు బ్యాంకుపై ఆధార పడి ఉన్నందువల్ల, అతనితోపాటు చంద్రబాబునాయుడు కూడా విపక్ష పార్టీలతో కలిసి బిల్లును అడ్డుకుంటారని అనేక మంది భావించారు. ఆర్టికల్ 370 విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్ధతునిచ్చిన తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతునిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే CAB విషయంలో ఆయా ముగ్గురు నేతలు అవలంభించిన వైఖరి ఇందుకు భిన్నంగా ఉండడం విశేషం.

ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే అనేక ఆసక్తికర రాజకీయ అంశాలు సాక్షాత్కరిస్తాయి. అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 16 నెలలపాటు జైల్లో ఉండి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా అయనకు లాభంకన్నా, నష్టమే ఎక్కువ జరుగుతుంది.  CAB విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమార్పులకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణాలోని హైదరాబాద్ నగరంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు చెందిన అనేక మంది వలస రూపంలో వచ్చి ఉన్నారు. ఈ పరిస్థితి ఏపీలో ఎక్కడా లేదని, CAB బిల్లుకు మద్ధతు ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని ముస్లింల మనోభావాలను జగన్ దెబ్బతీసినట్లు కానేకాదని ఏపీ అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ఏపీ సీఎం ప్రస్తుతం ఆర్థిక చట్రంలో ఇరుక్కున్నట్లుగానే భావించాలి. విభజన సమస్యల కారణంగా ఇబ్బందులను చవి చూస్తున్న జగన్ తన రాష్ట్రాన్ని పునర్ నిర్మించడానికి కేంద్రం నుంచి వరదలా పారే నిధుల కోసం నరేంద్రమోదీతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. తనను అధికారంలోకి తీసుకువచ్చిన ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాల అమలు కోసమైనా జగన్ మోదీ సర్కార్ తో స్నేహం నెరపక తప్పని స్థితి నెలకొంది.

అంతేగాక తన పార్టీకి చెందిన 22 మంది పార్లమెంట్, ఇద్దరు రాజ్యసభ సభ్యులపై బీజేపీ కన్నేసినట్లు జరుగుతున్న ప్రచారం కూడా వైఎస్ఆర్ అధినేత జగన్ శిబిరంలో కలవరం కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఎక్కడాలేని ప్రాధాన్యతనివ్వడం కూడా జగన్ శిబిరంలో తీవ్ర కలవరానికి కారణమైంది. అంతేగాక ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇప్పించేందుకు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి సీనియర్ ఎంపీలు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాఫలితం లేకపోయింది. ఇదే దశలో తమ సహచర ఎంపీ రఘురామ కృష్ణంరాజు అమిత్ షా గదిలోకి సులభంగా ప్రవేశిస్తున్న ఘటనలు కూడా వైఎస్ఆర్ సీపీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.

అంతేగాక రాబోయే రెండేళ్లలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లకు జరిగే ఎన్నికల్లో బీజేపీకి చంద్రబాబుకన్నాజగన్ మోహన్ రెడ్డి అవసరమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యుల సంఖ్య వైఎస్ఆర్ పార్టీకి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ గత ఏప్రిల్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మునిగిన తన పార్టీ నావను తేలుతూ ఉంచడానికి చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీకి గల ముగ్గురు పార్లమెంట్, ఇద్దరు రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం CAB కు పెద్ద అవసరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బీజేపీ పంచన చేరారు. మోదీతో మళ్లీ స్నేహ బంధం కోసం స్పష్టమైన సంకేతాలు పంపుతున్న చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో జరిగిన ఓ సమావేశంలో బీజేపీ గురించి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. కేవలం 9 శాతం ముస్లిం జనాభా ఉండి, ఎటువంటి మత ఘర్షణలులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నిలదొక్కుకునే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లోనే అటు జగన్, ఇటు చంద్రబాబు పార్టీలు పౌరసత్వ సవరణ బిల్లుకు మద్ధతుగా నిలవడం గమనార్హం.

ఇకపోతే బీజేపీ అనుకూల ప్రచారం నుంచి బయటపడేందుకు, కాషాయ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పునుంచి తన పార్టీని రక్షించుకునేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సమయం అసన్నమైంది. గత లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ద్వారా బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందనే విషయం స్పష్టమైంది. తెలంగాణాలోని 12 శాతం ముస్లింలకు రక్షకునిగా ఉన్నట్లు ప్రాచుర్యం పొందిన కేసీఆర్ ప్రస్తుతం తనను తాను రక్షించుకోవలసిన అవశ్యకత ఏర్పడింది. ఇందుకు కేసీఆర్ కు CAB వల్ల సరైన అవకాశం కూడా లభించినట్లయింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నీడనే కూర్చున్నట్లు కనిపించిన బీజేపీ తెలంగాణాలోని 17 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తన సమీప ప్రత్యర్థిని గమనించేందుకు ఆయనను అప్రమత్తం చేసినట్లయింది.

ఆసక్తికర అంశమేమిటంటే, దాదాపు అన్ని కీలక నిర్ణయాల్లో కేసీఆర్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు పలికారు. 15వ అర్థిక కమిషన్ సిఫారసులకు సంబంధించి కేరళలో జరిగిన సమావేశం సందర్భంగా కేసీఆర్ అవలంభించిన వైఖరి తెలిసిందే. CAB విషయంలో కేసీఆర్ పార్టీ అనుసరించిన వైఖరిపై రాకా సుధాకర్ రావు అనే రాజకీయ విశ్లేషకుడు మాట్లాడుతూ, తన పాలనపై ప్రజల్లో గల వ్యతిరేకత నుంచి కాపాడుకోవడానికి, తన మిత్రపక్షమైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని సంతోషంగా ఉంచడానికి, తన పార్టీకి ముస్లిం ఓటర్లు దూరం కాకుండా చూసుకునేందుకే వ్యతిరేక ఓటు వేశారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోనే గాక తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనేగాక తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుంచి సుమారు 30 నుంచి 40 వేల మంది వలస వచ్చిన వారు ఉన్నారని ఆయన అంచనా వేశారు. ఇందులో కనీసం 5 వేల మంది రోహింగ్యాలు కూడా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో CABకు సంబంధించి కేసీఆర్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చిందని సుధాకర్ రావు అభిప్రాయపడ్డారు.

-గాలి నాగరాజ

(ది వైర్ సౌజన్యంతో…)

Comments are closed.

Exit mobile version