యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన సైన్యానికి పిలుపునిచ్చారు. ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా కలకలానికి దారి దీసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మెరైన్ బలగాలను ఉద్ధేశించి గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మిలట్రీ బేస్ క్యాంపులో జిన్ పింగ్ ప్రసంగిస్తూ ఈ పిలుపునివ్వడం గమనార్హం. ఇందుకు సంబంధించి చైనా అధికారిక వార్తా సంస్థ షినువా మంగళవారం ఓ వార్తా కథనాన్ని ప్రచురించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి.
సైన్యం తన శక్తి సామర్ధ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించాలని, విశ్వసనీయతతో మనస్సును యుద్ధం వైపు మళ్లించాల్సిందిగా చైనా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ఇండియాకు ఉత్తర సరిహద్దుల్లో చైనా 80 వేల మంది సైనికులను మోహరించిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాపియా ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో చైనా అధ్యక్షుని పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిన్ పింగ్ వ్యాఖ్యలు ఇండియాను ఉద్ధేశించి చేసినవా? లేక అమెరికా, తైవాన్ సంబంధాల నేపథ్యంలో వ్యాఖ్యానించారా? అనే అంశం మాత్రం స్పష్టం కాలేదు. మొత్తంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు ప్రపంప వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.