పచ్చని పైర్లను చీడ, పీడలు ఆశిస్తే రైతులు ఏం చేస్తారు? పురుగు మందులతో పిచికారి చేస్తారు కదా? పంటలనే కాదు… ప్రస్తుతం మనుషులను ఆశిస్తున్న వైరస్ లకు కూడా పిచికారి చేయాల్సిన పరిస్థితులు అనివార్యమైనట్లు కనిపిస్తోంది. ఇటువంటి పిచికారి వీడియో గురించి చెప్పుకోవడానికి ముందు అందుకు దారి తీసిన పరిణామాల గురించి క్లుప్తంగానైనా చెప్పుకోవాలి కదా..? అందుకే ‘మేడిన్ చైనా… కరోనా వైరస్’కు సంబంధించిందే అసలు విషయం. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు అల్లకల్లోలానికి గురవుతున్న సంగతి తెలిసిందే.
చైనా నుంచి వచ్చే తమ దేశ పౌరుల విషయంలోవివిధ దేశాలు తీసుకుంటున్న పలు రకాల జాగ్రత్తల గురించి వింటూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏం జరిగిందో కళ్లారా చూడండి. అచ్చంగా ‘పిచికారి’ దృశ్యాన్నే తలపిస్తున్న ఈ సంఘటన బహుషా ఇండోనేషియా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విమానం దిగుతున్న ప్రయాణీకులపై ఏదో ద్రావకాన్ని ‘పిచికారి’ టైపులో స్ప్రే చేస్తున్న తీరును నిశితంగా గమనించండి. కరోనా వైరస్ ప్రభావమే కాబోలు. క్రిమి సంహారక మందులకు విలవిల్లాడినట్లుగానే… విమానం దిగిన ప్రయాణీకులు ఈ ‘కరోనా’ వైరస్ పై ద్రావకం పిచికారికి ధాటికి ఎలా తల్లడిల్లుతున్నారో దిగువన వీడియోలో వీక్షించండి. అయితే ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారు? ఎప్పటిది? కరోనా వైరస్ నేపథ్యమేనా? అనే అంశాలపై స్పష్టత లేకున్నా, సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే అసలు విశేషం.