చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తాజా ఆహార్యం (వస్త్రధారణ) ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవం సందర్భంగా జిన్ పింగ్ వస్త్రధారణ అచ్చు గుద్దినట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ తొలితరం నాయకుడు మావో జెడాంగ్ ను తలపించడం విశేషం. తియనాన్మెన్ స్క్వేర్ లో జరిగిన పార్టీ వందేళ్ల సంబరాల్లో జిన్ పింగ్ మాట్లాడుతూ, తమ దేశ ప్రజల సంకల్ప, సామర్థ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దన్నారు.
బెదిరించడం, లొంగదీసుకోవడం, అణచివేయడం వంటి ప్రయత్నాలను చైనా సహించదన్నారు. ఇటువంటి దుస్సాహసాలకు దిగేవారు 140 కోట్ల చైనా ప్రజలు సృష్టించిన ‘ ది గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ ను ఢీకొన్నట్లేనని, వారి తల పగులుతుందని హెచ్చరించారు. తైవాన్ విలీనానికి కట్టుబడి ఉన్నట్లు జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. సోషలిజం మాత్రమే చైనాను కాపాడుతుందని, ప్రజలకు పార్టీని దూరం చేయాలని ప్రయత్నించినవారు ఓడిపోయారని చైనా అధ్యక్షుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.