‘గోరుచుట్టుపై రోకలిపోటు’ అంటే ఇదే కాబోలు. మహారాష్ట్ర రాజకీయాల్లో అంచనాలు తలకిందులై తల బొప్పి కట్టిన బీజేపీకి మరో ఎదురుదెబ్బ. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో అక్కడి ఓటర్లు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్లోని 18 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి ఉప ఎన్నికల ఫలితాలు అశనిపాతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్-సదర్, కలియాగంజ్, కరీంపూర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలతో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫుల్ ఖుషీగా ఉన్నట్లు జాతీయ వార్తా సంస్థలు ఉటంకిస్తున్నాయి. బీజేపీకి గట్టి పట్టు గల కలియాగంజ్, ఖరగ్పూర్-సదర్ స్థానాల్లో టీఎంసీ గెలుపొందడం గమనార్హం కాగా, కలియాగంజ్ లో టీఎంసీ విజయం సాధించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విజయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానిస్తూ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తాము బలపడకుండా బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నికల విజయాన్ని బెంగాల్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.