జీతం తప్ప ‘గీతం’ తెలియని ఓ లీడర్ కథ!
ఓ సాధారణ సర్పంచ్ పదవికి ఓ వ్యక్తి రూ. కోటి రూపాయలు ఖర్చు చేసిన చరిత్ర మన తెలుగు రాజకీయాల్లో ఉంది. ముఖ్యంగా తెలంగాణాలోని అనేక పల్లెల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం కనిష్టంగా రూ. 50 లక్షల నుంచి గరిష్టంగా రూ. కోటి వరకు ఖర్చు చేసినట్లు అనధికార ప్రచారం జరిగింది. ఇవన్నీ అనధికార లెక్కలు లెండి. ఎన్నికల సంఘానికి సమర్పించే అధికారిక ఖర్చు లెక్క వేరే ఉంటుంది.
అంతెందుకు… నగర పాలక సంస్థల్లోనూ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన చాలా మంది కూడా ఈ బాపతు నేతలే. కేవలం ఓ మూడు, నాలుగు వేల ఓట్ల కోసం రూ. 30-40 లక్షలు ఖర్చు చేసి గెల్చినట్లు కూడా ప్రచారం జరిగింది. మరి ఇంతేసి డబ్బు ఖర్చు చేసినపుడు ‘రికవరీ’ ఎలా అంటారా? ఏ పార్టీ నుంచి గెల్చినా, ఓటు వేసిన ప్రజల వేలిపై సిరా మరక చెరగకముందే అధికార పార్టీ జెండాను మెడలో కప్పుకోవాలి. ఎలాగంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెల్చిన అనేక మంది తెలంగాణా ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచన చేరిన విధంగా అన్నమాట.
ఇక ఆ తర్వాత కాంట్రాక్టు పనులు, పెండింగ్ బిల్లులు తదితర వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి. ఓ వార్డుకు లేదా డివిజన్ కు ప్రాతినిధ్యం వహించే కౌన్సిలర్/కార్పొరేటర్ టయోటా ఫార్చూనర్ కారులో తిరగడం అలవర్చుకోవాలి. ఓ ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు ‘ఇన్నోవా క్రిస్టా’ వాహనంలో తిరుగుతూ రాజకీయం చేయాలి. ఇక్కడ వాళ్లకు లభించే ‘జీతం’ గురించి అస్సలు మాట్లాడకూడదు, ‘గీతం’ గురించే చర్చించుకోవాలి. ఇటువంటి నాయకుల జీవిత చరిత్రను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ పాఠంగా చదువుకోవాలి. ముఖ్యంగా కొందరు తెలుగు రాజకీయ నాయకులు ఆర్థికంగా ఎదిగిన, ఎదుగుతున్న తీరును అవగతం చేసుకోవాలి.
కానీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఇటువంటి అలవాట్లేవీ అబ్బినట్లు లేవు. లేకపోతే ‘జీతం’ సరిపోవడం లేదని ఏకంగా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడమేంటి? నిజమా..? అని నివ్వెరపోకండి. అక్షరాల నిజమేనట. బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక కాకముందు ఆయన లెక్చర్లు ఇస్తూ బతికేవారు. టెలిగ్రాఫ్ పత్రికలో కాలమిస్టుగానూ పనిచేసేవారు. అప్పట్లో అతనికి ఏటా 2.75 లక్షల పౌండ్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 2.61 కోట్లు) వచ్చేవి. వేన్నీళ్లకు చన్నీళ్ల మాదిరిగా కాలమిస్ట్ సంపాదనకు తోడుగా నెలకో రెండు ప్రసంగాలు ఇస్తే దాదాపు 1.6 లక్షల పౌండ్లు అదనపు ఆదాయంగా సమకూరేవి. ఇంత భారీ ఆదాయం గల బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాకే అసలు కష్టాలు మొదలయ్యాయి.
బ్రిటన్ లో ప్రధాన మంత్రి జీతం కేవలం 1.5 లక్షల పౌండ్లు మాత్రమేనట. అంటే గతంలో లభించిన ఆదాయాన్ని బేరీజు వేసినపుడు బోరిస్ జాన్సన్ కుటుంబ అవసరాలకు జీతం ఏమాత్రం సరిపోవడం లేదట. ఆరుగురు పిల్లలు గల బ్రిటన్ ప్రధాని విడాకులు ఇచ్చిన పూర్వ భార్యకు భరణం కూడా ఇవ్వాలి మరి. ఈ ఖర్చులకు, ప్రధాని పదవి ద్వారా వచ్చే ‘జీతం’ డబ్బులకు అస్సలు బ్యాలెన్స్ కుదరడం లేదట. కనీసం ఇంట్లో పనిమనిషి కూడా లేడని, ప్రధాని ఇల్లు దుర్గంధమని బోరిస్ ఫ్రెండ్స్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో బతకలేని ప్రధాని పదవి తనకెందుకుకని బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారట. అందుకే ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. బ్రెగ్జిట్ తర్వాత ఈ పదవి నుంచి దిగిపోవాలని బోరిస్ జాన్సన్ ఖరాఖండిగా నిర్ణయించుకున్నట్లు బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మిర్రర్ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఔనూ… జీతం సరిపోకుంటే పెంచుకునేందుకు ఓ జీవో తీస్తే పోలా…? మన తెలుగు రాజకీయ నాయకుల మాదిరిగా..! అబ్బే బ్రిటన్ ప్రధానికి ‘జీతం’ గురించి తప్ప ’గీతం’ రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలిసినట్లు లేవు.