జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లభించిన ఫలితాల జోష్ అనంతరం తెలంగాణా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రెండు గ్యాడ్యుయేట్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు అత్యంత వేగంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదిరులతో బీజేపీ నేతలు బిజీ బిజీగా మంతనాలు సాగిస్తున్నట్లు తాజా సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రామాణికంగానే జానారెడ్డి కుటుంబంతో బీజేపీ నేతల మంతనాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు కూడా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే వీరి చేరిక కార్యక్రమం ఆయా కార్పొరేషన్ల ఎన్నికలనాటికి కార్యరూపం దాల్చవచ్చనేది ప్రచారపు సారాంశం. మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ఊపులో తెలంగాణాలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా బీజేపీ నాయకత్వం పయనిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.