అనిల్ విజ్… పేరు గుర్తుందిగా? హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి. కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా కొద్ది రోజుల క్రితం ఆయన టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి ఇప్పుడు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని మంత్రి అనిల్ విజ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాను అంబాలాలోని ఆసుపత్రిలో చేరినట్లు కూడా మంత్రి వెల్లడించారు.
మంత్రి అనిల్ విజ్ గత నెల 20వ తేదీన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంబాలా హాస్పిటల్లో జరిగిన మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్ స్వచ్ఛంద వలంటీర్ గా వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా ఈ అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది.
వ్యాక్సిన్ రెండో మోతాదు తీసుకుని నిర్దిష్ట రోజులు గడిచిన తర్వాత మాత్రమే కరోనా వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలు ఏర్పడతాయని పేర్కొంది. ఇది రెండు మోతాదుల టీకాగా పేర్కొంటూ, టీకా వేసుకున్న తర్వాత అనిల్ విజ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఆయన ఒక డోస్ మాత్రమే తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.