సమ సమాజ స్థాపనకై, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని పోరాటం చేసిన ఓ సాయుధ నక్సల్ పోలీసు అధికారిగా మారితే ఎలా ఉంటుంది? అలీవ్ గ్రీన్ డ్రెస్సులో పోలీసులపై బందూకులతో విరుచుకుపడిన ఆ వ్యక్తి, అదే తుపాకీని తిరగేసి నక్సల్స్ వైపు గురి పెడితే మరెలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇది సాధ్యమా? అనే సందేహం కలుగుతోందా? కానీ ఇది కల్పిత సన్నివేశం కాదు. సినిమా ‘కత’ అంతకన్నా కాదు. ఓ నిజ జీవిత సజీవ దృశ్యం. మావోయిస్టు నక్సల్స్, పోలీసుల మధ్య నిత్యం రక్తమోడుతున్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సాక్షాత్కరిస్తున్న ప్రత్యక్ష చిత్రం. ఓ నక్సలైట్ తన జీవన గమనాన్ని మార్చుకుని విజయమార్గంలో పయనిస్తున్న వినూత్న గాథ.

పోలీసు యూనిఫాంలో కనిపిస్తున్న ఇతని పేరు భద్రు. దాదాపు దశాబ్ధంన్నర క్రితం అంటే 2005లో నక్సల్ ఉద్యమంలో చేరాడు. సాయుధ పోరాటం ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్మి 2013 వరకు మావోయిస్టు పార్టీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. కానీ ఎందుకో ఎంచుకున్న ఆశయం కనుచూపు మేరలో సిద్ధించేట్లు కనిపించలేదు కాబోలు. ఉద్యమం పట్ల విముఖత కలుగుతోంది. మనస్సు లొంగిపోవడానికి సంసిద్ధమవుతోంది. హింసా విధానం ద్వారా ప్రయోజనం లేదనే భావనకు వచ్చాడు. ప్రశాంత జీవనాన్ని అన్వేషిస్తూ జనజీవన స్రవంతిలో కలిశాడు. తుపాకీ మార్గాన్ని త్యజించి పోలీసులకు లొంగిపోయాడు.

విప్లవోద్యమాన్ని వీడి సాధారణ జనజీవన మార్గంలోకి వచ్చిన భద్రుకు మొదట్లో ‘ఇన్ఫార్మర్’గా ఉద్యోగం లభించింది. ఛత్తీస్ గఢ్ పోలీసు పరిభాషలో దీన్ని రహస్య సైనిక ఉద్యోగం అని కూడా వ్యవహరిస్తుంటారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రు అవిశ్రాంతంగా పనిచేశాడు. తనకు కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాడు. దిశ మార్చిన పయనంలో ఖాకీ యూనిఫాం ధరించి, తుపాకీ చేపట్టాడు. వరుస విజయాలు సాధించాడు. వెంట వెంటనే అయిదుసార్లు ప్రమోషన్ పొందాడు. ఇప్పుడు మాజీ నక్సల్ భద్రు కాస్తా పోలీసు అధికారి సంజయ్ గా మారాడు.

సంజయ్ అలియాస్ భద్రు ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ పోలీసు శాఖలో టీఐగా పోస్టింగ్ పొందారు. టీఐ అంటే ఠాణా ఇంచార్జ్. త్రీ స్టార్ పోలీసు అధికారి. సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) హోదా అన్నమాట. టీఐ సంజయ్ డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు (డీఆర్జీ) బలగాలతో కలిసి ప్రస్తుతం నక్సలైట్లను వేటాడే పనిలో ఉన్నారు. తన విజయగాధ గురించి సంజయ్ మాట్లాడుతూ, ‘నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలి. శాంతియుత జీవితాన్ని గడపాలి’ అని పిలుపునివ్వడం గమనార్హం. భద్రు అలియాస్ సంజయ్ లైఫ్ స్టోరీ ఛత్తీస్ గఢ్ లో తాజా చర్చనీయాంశం. అదే ఈ వార్తా కథనపు విశేషం.

– ‘బస్తర్ కీ ఆవాజ్’ సౌజన్యంతో…

Comments are closed.

Exit mobile version