మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు మావన హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ఆరోపించారు. ఈమేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు యాప నారాయణ @ హరిభూషణ్, సిద్దబోయిన సారక్క @ భారతక్కలు కరోనా వైరస్ సోకి మరణిచించినట్లు ఆ పార్టీ ఈ రోజు ఒక లేఖను విడుదల చేసిందని గుర్త చేశారు. ఇటీవల మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు, సభ్యులు మావోయిస్ట్ పార్టీలో కరోనా వైరస్ ఎవరికీ సోకలేదని తప్పుడు ప్రకటనలను విడుదల చేశారన్నారు.
మావోయిస్ట్ పార్టీలో కరోనా సోకిన నాయకులకు తప్పుడు వైద్య చికిత్సను అనుసరించి వారు ప్రాణాలను కోల్పోవడానికి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులే కారణమవుతున్నారని ఆరోపించారు. కరోనా సోకిన కింది స్థాయి నాయకుల, సభ్యుల ఆరోగ్యాల పట్ల మావోయిస్ట్ పార్టీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు .సరైన వైద్యం కొరకు బయటకు వద్దామనుకునేవారిని అడ్డుకుంటూ అగ్ర నాయకులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మావోయిస్ట్ పార్టీలో కరోనా వైరస్ సోకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే నాయకులు, సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసువారికి లొంగిపోవాలని, తద్వారా మెరుగైన వైద్య చికిత్స పొంది తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఎస్పీ సునీల్ దత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.