తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చైర్మన్, సభ్యులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సమర్థత కలిగిన అధికారులు, భాషా పండితులు, డాక్టర్, ఇంజనీర్, ఉద్యమకారులు, మహిళ, ఉద్యోగ సంఘ నాయకులను జర్నలిస్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిక చేయడం విశేషం. టీఎస్ఫీఎస్సీలో నియామకమైన వారి నేపథ్యాన్నిఓసారి పరిశీలిస్తే….

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితుడైన బి.జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పెద్దాయపల్లికి చెందిన వారు. ఆయనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధత, నిజాయితీతో పనిచేసి మచ్చలేని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్.వీ.ఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఆయన 1990లో ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటి కలెక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత నల్లగొండ ఆర్డీఓగా, కరీంనగర్ లో హౌసింగ్ శాఖ జిల్లా మేనేజర్ గా, డీఆర్డీఏ పీడీగా, హైదరాబాద్ లో ఎంప్లాయిమెంట్ జనరేషన్ మిషన్ సీఈఓగా, మెప్మా డైరెక్టర్ గా, వరంగల్, అనంతపురం జిల్లాల కలెక్టర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ కమిషనర్ గా, సహకారశాఖ రిజిస్ట్రార్ గా, శాతవాహన యూనివర్సిటీ ఇన్ చార్జ్ వీసీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఎం.డీ.గా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్ గా, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా, కాకతీయ యూనివర్సిటీ ఇన్ చార్జ్ వీసీగా పనిచేస్తున్నారు.

సభ్యులుగా నియమితులైనవారిలో రమావత్ ధన్ సింగ్ నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని జేత్యానాయక్ తాండాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. పబ్లిక్ హెల్త్ శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఇఎన్సీ హోదా వరకు ఎదిగారు. మిషన్ భగీరథ నిర్మాణ పనులను సమర్దవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఫ్లై ఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు, హైదరాబాద్ లోని రోడ్డు వెడల్పు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు.

అదేవిధంగా మరో సభ్యునిగా నియమితులైన ప్రొఫెసర్ బి.లింగారెడ్డి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన వారు. ఎస్సెస్సీ వరకు కందుకూరులో, ఇంటర్ విద్య సత్తుపల్లిలో, డిగ్రీ ఖమ్మంలో చదివారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ చదివి, అక్కడే రేడియేషన్ ఫిజిక్స్ లో పీహెచ్.డీ పట్టా పొందారు. 1996 నుంచి ప్రముఖ సీబీఐటీ కళాశాలలో ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ హెడ్ గా ఉన్నారు. విస్తృత పరిశోధనల ద్వారా ఈయన రాసిన కీలకమైన విషయాలు పలు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమై ప్రఖ్యాతి గాంచాయి. ప్రొఫైసర్ లింగారెడ్డి ఎన్నో జాతీయ సెమినార్లు, సమావేశాలు కూడా నిర్వహించారు.

కోట్ల అరుణకుమారి అనే మరో సభ్యురాలు రెవెన్యూశాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. ఎంఎ, ఎల్.ఎల్.బి. ఉన్నత విద్యనభ్యసించారు. ప్రస్తుతం వికారాబాద్ లో భూ భారతి జాయింట్ డైరెక్టర్ గా, వికారాబాద్ జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిపల్లికి చెందిన సుమిత్రా ఆనంద్ తనోబా తెలుగు ఎం.ఏ. వరకు చదివారు. ప్రస్తుతం తెలుగు భాషా పండితురాలి కోర్సు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం లింగపేట జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరుకు చెందిన కారం రవీందర్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ నుంచి బీకాం పట్టా అందుకున్నారు. ఏడాదిపాటు మంగపేట మండలం కమలాపురంలోని ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీలో, రెండేళ్లు వరంగల్ ఎస్సీ సహకార సొసైటీలో పనిచేసిన ఆయన అదే జిల్లాలో రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేరి 2020 వరకు నాయబ్ తహశీల్దార్ గా సేవలందించారు. విద్యార్థి దశ నుంచీ తెలంగాణావాదిగా ఉన్న రవీందర్ రెడ్డి టీఎన్.జీ.వోల సంఘం నాయకుడిగా, చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన డాక్టర్ అరవెల్లి చంద్రశేఖర్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో బీఏఎంఎస్ చదివారు. గత పదేళ్లుగా నవజ్యోతి స్వచ్ఛంద సంస్థల ద్వారా 30 వరకు వైద్యశిబిరాలు నిర్వహించిన ఆయన 33 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యుడిగా సేవలందిస్తూ పేదోళ్ల డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఆర్. సత్యానారాయణ అనే సభ్యుడు మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన చెందిన సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. తొలుత ఈనాడు, ఉదయం, వార్త దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ఎమ్మెల్సీగా కూడా సేవలందించారు.

Comments are closed.

Exit mobile version