ఆస్ట్రాజెనెకా కంపెనీ నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కరోనా వ్యాక్సిన్ రేసులో అందరికన్నా ముందున్న ఆక్ప్ ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా కంపెనీతో కలిసి కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీకా ట్రయల్స్ ఉన్న ఫళంగా నిలిపేశారు. అమెరికాలో సుమారు 30 వేల మంది వలంటీర్లను టీకా ప్రయోగానికి తీసుకున్నఆస్ట్రాజెనెకా కంపెనీ అందులో మూడొంతుల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
కానీ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వలంటీరుకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. దీంతో క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా కంపెనీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే ఇటువంటి సమస్యలను కనిపెట్టేందుకే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారని, లోతైన సమీక్ష అనంతరం తిరిగి ట్రయల్స్ కొనసాగిస్తారని అంటున్నారు. వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.