అడవి పచ్చగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది. జనం క్షేమంగా ఉంటారు. అడవి బిడ్డలుంటేనే అడవి క్షేమంగా
ఉంటుంది. దేశంలో అడవులను రక్షించేది ఆదివాసీలే. అరణ్యాన్ని, జీవజాలాన్ని అటవీశాఖ కాపాడుతుందనేది కేవలం భ్రాంతి. బస్తర్ లో 55 శాతం అటవీప్రాంతం చెక్కుచెదరకుండా భద్రంగా ఉందంటే, ఆ జిల్లా జనాభాలో 85 శాతం ఆదివాసీలు కావడమే కారణం. ఆదివాసీల ప్రాంతాలలోనే అడవి విస్తీర్ణం, జీవ వైవిధ్యం చెక్కు చెదరలేదని పలు పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.
నోరులేని ఆదివాసీల రక్షణ దేశానికి తక్షణావసరం. అడవి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించాలని స్వార్థ వ్యాపారవర్గాలు, బహుళజాతి కంపెనీలు, నిరంకుశ అధికారవర్గాలు చాలా కాలంగా గుంట కాడ నక్కవలె ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఏవో విబేధాలు ఉన్నట్లు కథలు అల్లి, జంతురక్షణకు ఏకైక మార్గంగా అడవి నుంచి ఆదివాసీలను తరలించాలని వాదిస్తున్నాయి.
ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా సాధించాయి. ఈ ఏడాది జూలై 27లోగా దేశంలోని అడవుల నుంచి 20 లక్షల మంది ఆదివాసీలను బయటికి సాగనంపాలని సుప్రీంకోర్టు తీర్పువెలువరించింది. ఎన్నికలు రావడంతో కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ తీర్పుపై స్టే తెచ్చుకున్నది.
సుప్రీంకోర్టు తీర్పు అమలైతే, తెలంగాణలో లక్ష మంది, ఆంధ్రప్రదేశ్ లో మరో లక్షమంది, ఛత్తీస్ గఢ్ లో నాలుగు లక్షలమంది, మొత్తంగా దేశంలో 20 లక్షల మంది ఆదివాసీలు అడవికి దూరమౌతారు. అంటే చేపలు నీటికి దూరమైనట్లే. నిర్వాసితులు కావడమే కాకుండా ఆదివాసీలు బతుకును, బతుకుదెరువును రెండింటినీ పోగొట్టుకుంటారు.
ఇది చాలదని, పులి మీద పుట్ర వలె అటవీచట్టం ముసాయిదా
సవరణ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. ఈ ముసాయిదా సవరణచట్టం పార్లమెంట్ ఆమోదం పొందితే, తల్లి నుంచి బిడ్డను వేరు చెసినట్లు, అడవి నుంచి ఆదివాసీలను ఏరేస్తారు.
దీనికోసం అటవీసిబ్బందికి తుపాకులు, ఇతర మారణాయుధాలు సమకూరుస్తారు. చెట్టును కొట్టబోతున్నట్లుగాని, జంతువును చంపబోతున్నట్లుగానీ ఏ కొంచెం అనుమానం వచ్చినా చాలు, ఆదివాసిని కాల్చిచంపే అధికారం అటవీసిబ్బందికి లభిస్తుంది.
ఆదివాసీని చంపినా అధికారులకు నేరం అంటదు, చేతికి రక్తం అంటదు. మైలఅంటదు, పాపం కూడా అంటదట. భారత శిక్షాస్మృతి నుంచి అధికారులకు పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఏ అధికారిపై హత్యానేరం కింద ప్రాసిక్యూషన్ సాగదు.
ఫలితంగా అడవిబిడ్డలు, స్వంత ఇంటిలో పరాయివారు, నేరస్థులు అయిపోతారు. సాయుధులైన అటవీసిబ్బంది, వ్యాపారసంస్థలు, మైనింగ్ కంపెనీలు క్రమంగా అడవికి యజమానులైపోతారు. అందుకే…
అడవితల్లిని కాపాడుకుందాం! అడవిబిడ్డలను కాపాడుకుందాం!!
✍️ అర్వపల్లి విద్యాసాగర్
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
Pic: Bastar forest