మేడారం జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క రాక దృశ్యం కాసేపట్లో సాక్షాత్కరించనుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా అభివర్ణించే సమ్మక్క తల్లి రాక ఆద్యంంతం భక్తి పారవశ్యాన్ని ప్రస్ఫుటింపజేస్తుంది. సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే ప్రక్రియను పూజారులు అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు.

అమ్మవార్ల గద్దెలకు ఎదురుగా ఉన్నటువంటి చిలకల గుట్ట నుంచి సమ్కక్కను తీసుకువస్తారు. సమ్మక్క రాక సందర్భంగా గద్దెల నుంచి చిలకల గుట్టకు వెళ్లే మార్గం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఉద్విగ్న వాతావరణం… వందలాది మంది పోలీసుల భద్రత మధ్య పూజారులు చిలకల గుట్ట నుంచి అమ్మవారిని తీసుకువస్తారు.

లక్షలాది భక్తుల గొంతుకల నుంచి సమ్మక్క నామస్మరణల మధ్య సమ్మక్కను తీసుకువచ్చే దృశ్యాన్ని కనులారా వీక్షించినవారు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. సమ్మక్క గద్దెకు చేరుకునే సమయంలో సంబంధిత జిల్లా ఎస్పీ స్వయంగా తుపాకీ కాల్పులు జరపడం ఆనవాయితీ. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ, ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ, గత జాతర నుంచి ములుగు జిల్లా ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి సూచికగా భక్తులకు తెలియజేయడం చూసి తరించాల్సిన అద్భుత ఘట్టం.

Comments are closed.

Exit mobile version