కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు ఆదివారం ఢిల్లీ విమానం ఎక్కేందుకు సంసిద్ధమైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శిబిరంలో మరో పిడుగులాంటి వార్త ఇది. పొంగులేటి మరో ముఖ్య అనుచరుడైన తుళ్లూరి బ్రహ్మయ్యపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పొంగులేటి ముఖ్య అనుచరుల్లో ఒకరైన డీసీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటనను మరువకముందే మరో ప్రధాన అనుచుడైన బ్రహ్మయ్యపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఆయన వర్గంలో అలజడికి కారణమైంది. ప్రస్తుతం బ్రహ్మయ్య కోసం పోలీసులు అరెస్ట్ వారెంట్ చేతబట్టుకుని గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కేసు వివరాల్లోకి వెడితే…
ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మ య్యపై నిరుడు జూన్ 29వ తేదీన దాడి జరిగింది. గతంలో అశ్వాపురం పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసి బదిలీ అయి అప్పట్లో పాల్వంచలో పనిచేస్తున్న పాయం సత్యనారాయణ, మంచికంటినగరు చెందిన వూకె సతీశ్ ఆధ్వర్యంలో సుమారు 40-50 మంది గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అశ్వాపురం పీఏసీఎస్ లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో బ్రహ్మయ్యకు చెందిన కారును కూడా ధ్వంసం చేశారు. గొల్లగూడెం పంచాయతీలోని చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద ఓ భూవివాదం కొనసాగుతోంది. ఆ వివాదం గురించి మాట్లాడదామని చెప్పి సాయంత్రం సత్యనారాయణ, సతీశ్, గిరిజనులు పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చారు.
సమాచారం అందుకున్న బ్రహ్మయ్య కార్యాలయానికి వచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే ప్రత్యర్థులు వాగ్వాదానికి దిగి బ్రహ్మయ్యపై పడి తోసేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న తుళ్లూరి అను చరులు వారిని అడ్డుకున్నారు. బ్రహ్మయ్యను పీఏసీఎస్ కార్యాలయంలోని గది లోపలికి తీసుకెళ్లి తలుపులు వేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు బ్రహ్మయ్య ఫిర్యాదు చేశారు. ఓ ప్రణాళిక ప్రకారం తనపై దాడి చేయాలన్న ఉద్దేశంతోనే వారు మారణాయుధాలతో సహా కార్యాలయానికి వచ్చారని ఆరోపిస్తూ పాయం సత్యనారాయణ, వూకె సతీశ్, గుర్తుతెలియని మరో 40 మంది గిరిజనులపై బ్రహ్మయ్య ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు తుళ్లూరి బ్రహ్మయ్యపై జరిగిన దాడికి సంబంధించి అశ్వాపురం పోలీసుస్టేషన్లో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పాయం సత్యనారాయణతోపాటు 11మంది వ్యక్తులపై, సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మయ్యతోపాటు 8 మంది వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాదాపు ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనలో బ్రహ్మయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు ఇటీవలే చార్జ్ షీట్ ను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలిసింది. దీంతో బ్రహ్మయ్యపై కోర్టు రెండు రోజుల క్రితం వారెంట్ జారీ చేయగా, తుళ్లూరి బ్రహ్మయ్యను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తుళ్లూరి బ్రహ్మయ్య పినపాక నియోజకవర్గ కార్యకలాపాల్లోనేగాక జిల్లా స్థాయిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరునిగా ప్రాచుర్యం పొందడం గమనార్హం. బ్రహ్మయ్యపై వారెంట్ జారీ అయిన విషయాన్ని పోలీసులు వర్గాలు ధ్రువీకరించాయి.