బందరు మండలం తుమ్మలపాలెం, వాడగొయ్యి గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ , గ్రామసభలు ముగించుకొనేసరికి సోమవారం రాత్రి 10 గంటలవుతోంది. ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కాన్వాయ్ మచిలీపట్నం వైపునకు దూసుకువస్తోంది.
సంక్రాంతి అంటేనే పల్లెకు ప్రత్యేక కళ వస్తుంది. పచ్చని పంట పొలాలు, ఇంటికి చేరిన ధాన్యం రాశులతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది.. మరోపక్క పేదలకు ఈ పండుగ సమయంలోనే ఇళ్లస్థలాలు ప్రభుత్వం అందచేస్తుంది. దీంతో పల్లెకు పండుగొచ్చింది.. వాకిళ్లకు ‘వర్ణ’కాంతులను, ఇంటిల్లిపాదికీ సకల సౌభాగ్యాలను మోసుకొచ్చింది.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. ముత్యాల ముగ్గులు.. పతంగుల ఆటలు.. ఇళ్లకు చేరిన బంధువులు.. అన్నింటికీ మించి రైతన్న ఇళ్లకు చేరే పంట సిరులతో ఇప్పుడు ఏ ఊరుకెళ్లినా సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొడుకులు బిడ్డలు, పిల్లాపాపలతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. పిండివంటలతో ఇల్లిల్లూ ఘుమఘుమలాడుతున్నది. బుధవారం భోగి, గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమను కనుల పండువగా జరుపుకునేందుకు జనం సిద్ధమయ్యారు.
చిన్నాపురం గ్రామానికి వచ్చేసరికి వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. మంత్రి పేర్ని నానికి ఆ వేళలో రోడ్డుపై గంగిరెద్దుల విన్యాసాలు ప్రదర్శిస్తున్న కళాకారులు వందలాదిమంది ప్రజలు గుమిగూడి ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యం ఎంతో ముచ్చటగా అన్పించింది. ఆయన వెంటనే కారు దిగి సామాన్యుని మాదిరిగా రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చుని గంగిరెద్దుల ప్రదర్శన ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ” డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా ఉరుకుతూ రారన్నా రారన్న బసవన్నా అమ్మవారికీ దండం బెట్టు… అయ్యగారికీ దండం బెట్టు…పేర్ని నాని గారికి దండం బెట్టూ… పేదల మనిషి పేర్ని నాని గారికి దండం బెట్టూ
రారా బసవన్నా, రారా బసవన్నా… ” అంటూ గంగిరెద్దులాటనే జానపద కళారూపం చిన్నాపురం గ్రామంలో మొదలయ్యింది.
మంచి వయసులో వున్న కోడె గిత్తల్ని తీసుక వచ్చి, వాటి ముక్కులకు ముకుతాడు కట్టి వాటి పొగరుబోతుతనాన్ని అణగ గొట్టి, వాటిని లొంగ దీసుకుని, చెప్పినట్ట్లు చేసేలా శిక్షణ ఇస్తారు. ఇలా వాటిని కొన్ని మాసాల పాటు మచ్చిక చేసుకునే వారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించటం, పరుగెత్తించటం, పడుకోబెట్టటం, అటూ ఇటూ దొర్లటం, మూడు కాళ్ళ మీద నుంచో పెట్టటం, చిట్టి అడుగులతో నృత్యం చేయటం, దూడూ బసవన్నా, రారా బసవన్నా అంటూ వాటిని పరుగులు పెట్టించటం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే కాలు పైకెత్తి సలాం చేయటం, ఆడించే వాడు వెల్లకిలా పడుకొని తన గుండెలమీద గంగి రెద్దు ముందు రెండు కాళ్ళను, తొడలమీడ వెనక కాళ్ళను పెట్టించుకుని వూపడం, ఇలా ఎన్నో విద్యల్ని కొన్ని మాసాలపాటు నేర్పి వీధిలోకి ప్రదర్శనకు తీసుకవస్తారు. వీరు గంగిరెద్దుల్ని స్వంత బిడ్డల్లా చూస్తారు. వాటిని ఎన్నో రకాలుగా అలంకరిస్తారు. మూపురం వద్ద నుండి తోక వరకూ ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. రింగులతో కొమ్ములను అలంకరిస్తారు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి చివరి భాగంలో రంగురంగుల ఊలు దారాల కుచ్చులను కట్టతారు. వీటినే కుప్పెలు అని అంటారు. మూతికి తోలుతో కుట్టబడిన మూజంబరంను కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. అందమైన గవ్వలను కూడా కడాతారు. మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగ వేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును, గవ్వల హారాన్ని కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. ఇంటి యజమానులు చీరలు, దుప్పట్లు వంటి బట్టలను ఇస్తారు. వాటిని ఆ గంగిరెద్దు వీపు మీద వేస్తుంటారు. అప్పుడు చూడాలి ఆ బసవన్నల అందం. సాక్షాత్తూ నందికేశ్వరుని పోలి వుంటుంది.
ఇక వీటిని ఆడించే వారి హంగులు చూడాలంటే మాటలు చాలవు.. గంగి రెద్దుల వారి హంగులు, శ్రుతి సన్నాయి బూర, డోలు, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేగంట, వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారు వీరు ఇచ్చిన పాత కోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామంతో సైకిల్ పంచ కట్టు కట్టి ఆకర్షణీయంగా తయారౌతారు. గంగిరెద్దుల వారికి ప్రతి వూరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగస్థలం. ముందుగా గ్రామంలో ప్రవేశించి, గ్రామ పెద్దల నాశ్రయించి వారి అనుమతితో ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు. వారి వాయిద్యాలాతో రణగొణ ధ్వనులు చేసి ప్రజలను రప్పిస్తారు. ఆ రోజుల్లో గంగి రెద్దుల ఆటలంటే మహా దానందంతో హాజరయ్యేవారు. ప్రేక్షకులందరూ మూగిన తరువాత గంగి రెద్దులను మేళతాళాలతో బరినంతా తిప్పుగూ స్వాగతం పలికిస్తారు. ఎద్దు నోటిలో మెడను ఇరికించి అదృశ్యాన్ని అందరికీ చూపిస్తారు.
వాయిద్యానికి అనుకూలంగా గజ్జెల కాళ్ళతో నృత్యం చేసేది, పడుకో మంటే పడుకునేది, లేవమంటేలేచేది, అయ్యగారికి దండం పెట్టమంటే తలవంచేది. అయ్యగారికి శుభం కలుగుతుందా? అనుకున్న పనులు జరుగుతాయా అంటే అవునన్నట్టు తల వూపుతుంది. వాడు అడిగిన ప్రతిదానికీ తల వూపడాన్ని బట్టే ఒక సామె పుట్టింది. మనవాళ్ళు అంటూ వుంటారు. ‘ఏమిటిరా అడిగిన ప్రతిదానికీ గంగిరెద్దులా తల వూపుతావు. నోటితో సమాధానం చెప్పరా’ అని. అది ఏనాడో పుట్టిన సామెత. దాదాపు అరగంటకు పైగా గంగిరెద్దుల ఆటను వీక్షించిన మంత్రి పేర్ని నాని కళాకారులకు కొంత నగదును బహూకరించి మచిలీపట్నానికి ప్రయాణమయ్యారు.
✍️ ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం