ఆ మధ్య ఉత్తర తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకాయన తన సతీమణి సహా అమెరికా వెళ్లారు. తన కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండడంతో ఓసారి పిల్లగాన్ని చూసి వద్దామని వెళ్లారు. సరే సుదూర ప్రాంతమైన ఇండియా నుంచి తన తల్లిదండ్రులు రావడంతో మాజీ ఎమ్మెల్యే కుమారుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకేముంది ఫ్రిజ్ ఓపెన్ చేసి ఓ పే…ద్ద ఐస్ గడ్డను తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసే పని ప్రారంభించాడు. ఎంతకీ ఐస్ గడ్డ దారికి రాకపోవడంతో గ్యాస్ వెలిగించి స్టౌ మంట మీద ఓ గిన్నెలో ఐస్ గడ్డను వేసి కరిగించేందుకు సిద్ధమయ్యాడు. కొడుకు చేస్తున్న వంట పని బాపతు ప్రక్రియ ఏమిటో బోధపడక సదరు మాజీ ఎమ్మెల్యే కాసేపు తల నిమురుకుని గిన్నెలో స్టౌ మీద కరిగిస్తున్నదేమిటి బిడ్డా? అని కొడుకును ప్రశ్నించాడు. ‘చికెన్ నాన్నా… ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఫ్రిజ్ లో దాచుకున్న చికెన్ ను ఇలాగే వండుకోవాలి’ అన్నాడట.
అంతే… మాజీ ఎమ్మెల్యేగారికి తలకాయ తిరిగిపోయిందట. ఇంకేముంది తెలంగాణా భాషలో, యాసలో తిట్ల దండకం అందుకున్నాడట. ‘మన దగ్గర మంచిగ ఇంట్లో పెరిగే కోడిని దొర్కబట్టి, కత్తిపీట దీస్కుని, మెడకాయ దప్పించి, గట్టిగ మషాలా దట్టింది, ఘుమ ఘుమలాడుతున్న సువాసన మధ్య కోడి కూర తింటె ఎట్లుంటది? గీ ఐస్ గడ్డలల్ల రోజుల తరబడి ముర్గబెట్టిన దాన్ని కోడి కూర అంటరా? ఏందిర నువ్వూ… నీ బతుకు. ఛల్… నేనిక్కడ ఒక్క దినం గూడ ఉండ. నేన్ బోతాన…’ అంటూ సంచి సదురుకుని సదరు మాజీ ఎమ్మెల్యే విమానం ఎక్కి కరీంనగర్ జిల్లాలోని తన సొంతూరుకు ఆఘ మేఘాల మీద వచ్చారు. అప్పుడెప్పుడో ఈ సంగతిని సదరు మాజీ ఎమ్మెల్యే మాంచి రసవత్తరంగా, కడుపుబ్బా నవ్వుకుంటూ చెప్పారు లెండి. అమెరికాలో ‘కోడి కూర’ తినేవారి బతుకు సంగతిని నెమరు వేసుకుంటూ మరీ వివరించారు. గుర్తున్నంతవరకు విషయమైతే ఇదే. అప్పటి సంగతి ఇప్పుడెందుకనేగా మీ సందేహం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే కదా? తనతోపాటే అమెరికాలో ఏళ్ల తరబడి ఐస్ గడ్డల మధ్య గుట్టలుగా పేరుకుపోయిన చికెన్ లెగ్ పీసులను కూడా వెంట తీసుకువస్తున్నారట. అంటే అమెరికా ఐస్ గడ్డల్లో దాచిపెట్టిన కోడికాళ్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించుకునే ఒప్పందాన్ని మరింత సరళతరం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చికెన్ దిగుమతులపై సుంకాన్ని పది శాతానికి తగ్గించాలనే ఒప్పందం కూడా ట్రంప్ భారత్ పర్యటనలో ఉండబోతోందట. మరి అమెరికన్లు ‘లెగ్గు పీసు’లను తినరా? అని అమాయకంగా ప్రశ్నించకండి.
లెగ్గు పీసులను చూసి మనం లొట్టలేసుకుంటాం గాని, అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని భావించి అక్కడి వారు కేవలం కోడి ఛాతీ భాగాన్ని మాత్రమే తింటారుట. ఈ బ్రెస్ట్ ముక్క కోసం రెండున్నర రెట్ల మేర ధరను అదనంగా కూడా చెల్లిస్తారట. ఇక నుంచి ఆంధ్రా పందెం పుంజులను, తెలంగాణ నాటుకోళ్ల రుచికి బదులు అమెరికాలో ఐస్ గడ్డల చాటున ఏళ్ల తరబడి ముర్గబెట్టిన లెగ్గు పీసులను చూసి లొట్టలేయాలన్నమాట. వాక్కో…యాక్కో అంటూ అప్పుడే వాంతి చేసుకోకండి. అదేదో పేరున్న షాపులో పిండిని దట్టంచి, మసాలా పూసి, వేయించి ఇస్తుండగా ప్రస్తుతం లొట్టలేసుకుంటూ తింటున్న లెగ్గు పీసులు కూడా అదే బాపతనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా అంతేనన్నమాట. తినగ… తినగ… అమెరికన్ ‘మురిగీ’ లెగ్గు పీసు బహు పసందు కావచ్చు.