కరోనా మహమ్మారి వల్ల చోటుచేసుకుంటున్న మరణాలపై రకరకాల కథనాలు ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అనేక ఘటనల్లో వైద్య, ఆరోగ్యశాఖ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది కూడా అదే తరహా ఘటనగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు ప్రకారం… ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు పోతురాజు. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఆదివాసీ. ప్రభుత్వ టీచర్ కూడా. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల కోసం వరంగల్ మహానగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. వైద్య సిబ్బంది పోతురాజు నుంచి శాంపిళ్లను కూడా తీసుకున్నారు.
అనంతరం ఆయను కోవిడ్ జనరల్ వార్డులో జాయిన్ చేసుకున్నారు. కానీ అయిదు రోజులు గడిచినా పోతురాజుకు సంబంధించిన కరోనా టెస్టుల ఫలితాల రిపోర్ట్ రాలేదట. దీంతో వైద్యులు కూడా అతనికి ఎటువంటి వైద్యాన్ని అందించలేదట. ఫలితంగా టీచర్ పోతురాజు ఈరోజు తుదిశ్వాస విడిచారని అతని కుటుంబ సభ్యులతోపాటు ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా టెస్టుల్లో ఎంజీఎం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ ఘటన పరాకాష్టగా ఆ సంఘలు ఆరోపిస్తున్నాయి.
కరోనా నిర్ధారణ కోసం శాంపిళ్లను తీసుకుని అయిదు రోజులు గడిచినా రిపోర్టు రాకపోవడం, అందువల్లే వైద్యం అందించలేదనే ఆదివాసీ సంఘాల ఆరోపణలు నిజమైతే మాత్రం ఎంజీఎం ఆసుపత్రిలో నిజంగా ఈ ఘటన ‘దారుణమే’ కదా!