దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో పోలీసులు బుధవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశముంది. పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు లాయర్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగానేగాక, దేశవ్యాప్తంగానూ కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. హత్యకు గురైన అడ్బకేట్ వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు, అనుమానాల మేరకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఇందులో భాగంగానే దాదాపు పది రోజుల పాటు ఆచూకీ లేకుండా, అదృశ్యమైన మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధును పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అంతేగాక మధు భార్య, మంథని మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజను, మార్కెట్ కమిటీ చైర్మెన్ పూదరి సత్యనారాయణలను రామగుండం కమిషనరేట్ లో పోలీసులు విచారించారు. అడ్వకేట్ దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులకు పుట్ట మధు సుపారీ ఇచ్చారని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు స్పందించారు. ఈమేరకు పుట్ట మధు, అతని బంధువుల బ్యాంకు ఖాతాలను, ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు.

ఆయా పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు బుధవారం మంథని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో పోలీసులు కేవలం ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలు చేస్తారా? ఫైనల్ ఛార్జ్ షీట్ సమర్పిస్తారా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఎందుకంటే ఏ కేసులోనైనా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే సంబంధిత ఘటనలో పోలీసుల దర్యాప్తు పూర్తయినట్లుగానే భావిస్తుంటారు. అయితే తొలుత సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఏవేని సవరణలు చేయాల్సి వస్తే సప్లిమెంటరీగా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తుంటారు. దీంతో అడ్వకేట్ దంపతుల హత్యోదంతంలో పోలీసులు సమర్పించే ఛార్జ్ షీట్ పై సహజంగానే పలువురిలో ఆసక్తి నెలకొంది. అధికార పార్టీకి చెందిన పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు వంటి ముఖ్యనేత సహా మరికొందరు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుండడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో సహజంగానే పోలీసులు సమర్పించే ఛార్జ్ షీట్ లోని అంశాలపై ఆసక్తి ఏర్పడింది. కాగా హత్య కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలుకు ఎటువంటి గడువు ఉండదని, కానీ 90 రోజుల్లోపు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయని పక్షంలో అరెస్టయిన నిందితులకు బెయిల్ లభించే అవకాశాలు ఉంటాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఇదే దశలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లయితే సంబంధిత కేసులో దర్యాప్తు ముగిసినట్లేనని, నిందితులకు బెయిల్ లభించే అవకాశాలు మరింత మెరుగైనట్లుగానే భావించాల్సి ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా అడ్వకేట్ దంపతుల హత్య కేసులో పోలీసులు దాఖలు చేయనున్న ఛార్జ్ షీట్ లో ప్రస్తావించే అంశాలపై సర్వత్రా ఆసక్తికి కారణమైంది.

Comments are closed.

Exit mobile version