మంథని మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజకు పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గట్టు వామన్ రావు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో నిందితులైన తులసిగిరి శ్రీనివాస్ అలియాస్ బిట్టు శ్రీను, ఊదరి లచ్చయ్యలను గత మార్చి 19వ తేదీన వరంగల్ జైలు నుంచి మంథని కోర్టుకు 164 స్టేట్ మెంట్ రికార్డు కోసం తీసుకువచ్చిన సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు మంథని పోలీసులు వెల్లడించారు. కోర్టు హాలులో నిందితులకు ఎస్కార్టుగా ఉన్న ఆర్ఎస్ఐ అజ్మీరా ప్రవీణ్ వారించినా వినకుండా నిందితులతో వీడియో కాల్ మాట్లాడించే ప్రయత్నం చేసిన మంథని మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజపై కేసు నమోదైందని, ఆయా కేసులో ఈరోజు శైలజను పోలీస్ స్టేషన్ కు పిలిపించి నోటీసు ఇచ్చినట్లు మంథని పోలీసులు ప్రకటించారు. తర్వాత చర్యల్లో భాగంగా ఈ కేసులో కోర్టుకు చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు కూడా పోలీసులు వివరించారు. పుట్ట శైలజ మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు సతీమణి అనే విషయం తెలిసిందే.

Comments are closed.

Exit mobile version