తెలంగాణా సీఎం కేసీఆర్ తో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఢీ అంటే ఢీ అనబోతున్నారా? కరోనా వైరస్ అంశంలో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ వార్తా కథనంపై ఈనెల 6వ తేదీన కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘కేసీఆర్ చెప్పిండంటే ఖతర్నాక్ ఉంటది. సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటాం. సర్కార్ చూడడం లేదని అనుకోవద్దు’ అని కేసీఆర్ మీడియా సమవేశంలో రాధాకృష్ణను హెచ్చరించారు. వాస్తవానికి ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రజ్యోతి పత్రికనుగాని, రాధాకృష్ణ పేరును గాని కేసీఆర్ ప్రస్తావించలేదు. ఆయా పత్రికలో ప్రచురితమైన వార్తా కథనపు హెడ్డింగును మాత్రమే ఉటంకిస్తూ పరోక్షంగా రాధాకృష్ణకు తీవ్ర స్థాయిలోనే కేసీఆర్ హెచ్చరిక జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హెచ్చరికలపై ఆంధ్రజ్యోతి ఇప్పటికే తనదైన శైలిలో స్పందించింది. కానీ ప్రతి ఆదివారం రాధాకృష్ణ పేరుతో ‘కొత్తపలుకు’ కాలమ్ కింద ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యే వ్యాసాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి టీవీలో శనివారం రాత్రే ప్రసారం చేస్తుంటారు. ‘కేసీఆర్ ఆంధ్రజ్యోతిని శిక్షిస్తానంటే ఇక్కడ భయపడేదెవరు?, కేసీఆర్ అనే ఆధునికి నిజాం ప్రభువుకి అందరూ గులాంగిరీ చేయాల్సిందేనా? అంతా నాకే తెలుసన్న అహంకారంతో విర్రవీగితే ఎలాంటి పరిస్థితి వస్తుంది? కేసీఆర్ నైజంపై ప్రొఫెసర్ జయశంకర్ గతంలో ఎటువంటి విశ్లేషణ చేశారు? ’ వంటి ప్రశ్నల ప్రోమోతో ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కార్యక్రమాన్ని రూపొందించారు. మరికొద్ది సేపట్లో… అంటే శనివారం రాత్రి 8.30 గంటలకు ఈ కార్యక్రమం ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారం కాబోతున్నట్లు ప్రకటించారు.

ఈనెల 6వ తేదీన మీడియా సమావేశంలో కేసీఆర్ హెచ్చరికకు వేమూరి రాధాకృష్ణ ఘాటుగానే ప్రతిస్పందించినట్లు ప్రోమో వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.

Comments are closed.

Exit mobile version