అవతలి వ్యక్తి పరోక్షంగా చేసే వ్యాఖ్యలను తమకు అన్వయించుకుని, తమను ఉద్ధేశించి అన్నట్లుగానే బాహాటంగా పేర్కొంటూ కొందరు ప్రతిస్పందించే విధానాన్ని ‘అడ్మిట్’ కావడం అంటారు. ముఖ్యంగా న్యాయ పరిభాషలో ఈ ‘అడ్మిట్’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు కూడా. తెలంగాణా సీఎం కేసీఆర్ దాదాపు వారం క్రితం చేసిన పరోక్ష హెచ్చరికలు తనను ఉద్ధేశించినవిగానే ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఉరఫ్ ఆర్కే అంగీకరించారు. ఇందులో భాగంగానే తెలంగాణా సీఎంపై విరుచుకుపడుతూ తనదైన శైలిలో ప్రతిస్పందించారు కూడా.

‘కేసీఆర్ చెప్పిండంటే ఖతర్నాక్ ఉంటది’ అని ఈనెల 6వ తేదీన తెలంగాణా సీఎం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పటి మీడియా సమావేశంలో రాధాకృష్ణ సంగతి చూస్తా… అన్నట్లుగానే సీఎం కేసీఆర్ పరోక్ష హెచ్చరికలను కాస్త తీవ్ర స్వరంతోనే చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హెచ్చరికలకు భయపడేవారెవరు? అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత తన ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా తిరగబడ్డ తరహాలో ప్రశ్నించడమే తాజా విశేషం.

రాధాకృష్ణ చంద్రబాబుకు కొమ్ము కాస్తారా? లేక ఎల్లో మీడియా జాబితాలో ఆయన పత్రిక, టీవీ ఉన్నాయా? అనే ప్రశ్నలను కాసేపు విస్మరిస్తే, కేసీఆర్ పరోక్ష హెచ్చరికలపై ఆయన స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మీడియా సమావేశంలో ఆంధ్రజ్యోతి పేరునుగాని, దాని అధినేత నామధేయాన్నిగాని కేసీఆర్ ఉచ్ఛరించకపోయినా, తనను, తన పత్రిక రాతల తీరుతెన్నులను తెలంగాణా సీఎం హెచ్చరించినట్లు రాధాకృష్ణ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం.

కరోనా సోకాలని కేసీఆర్ తనను శపించినట్లు రాధాకృష్ణ తన రాతల్లో అంగీకరించడం విశేషం. కేసీఆర్ కంటే శక్తివంతుడైన దేవుని దయ వల్ల ఇప్పటివరకు తాను క్షేమంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు. కేసీఆర్ పత్రిక పేరును ప్రస్తావించకపోయినా, ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా రాసిందని విమర్శించినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇటువంటి అనేక అంశాలను వివరంగా విశదీకరిస్తూ కేసీఆర్ తనను, తన పత్రికను హెచ్చరించినట్లు రాధాకృష్ణ తన రాతల్లో స్పష్టం చేశారు.

ఇదే సమయంలో కేసీఆర్ నిర్వహించే సమీక్షా సమావేశాలపై రాధాకృష్ణ తన రాతల్లో సరికొత్త సందేహాలను కలిగిస్తూ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘నిజానికి మీరు నిర్వహిస్తున్న సమావేశాల్లో జరుగుతున్నదేమిటో ప్రజలకు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు’ అని అన్నారు. నచ్చిన అధికారులతో, పార్టీవాళ్లను పక్కనబెట్టుకుని గంటల తరబడి ‘ముచ్చట్లు’ చెప్పే మీరు అధికారులను మాట్లాడనిస్తారా? అంటూ నిలదీశారు. ‘పిల్లల కోడి’లా కొంత మందిని వెంటేసుకుని విలేకరుల సమావేశం పెట్టి, ఆ తర్వాత వెంటనే మాయమవడం లేదా? అని ప్రశ్నించారు. ఫామ్ హౌజ్ లో గడిపిన రోజులెన్నో ప్రజలకు చెప్పారా? అని నిలదీశారు.

కేసీఆర్ ను ఆధునికి నిజాం ప్రభువుగా అభివర్ణించారు. గులాంగిరీ చేయాల్సిందేనా? అని కూడా ప్రశ్నించారు. ప్రభుత్వాలు కేసులు మాత్రమే పెట్టగలవని, శిక్షలు విధించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ‘అయినా వాళ్లకీ, వీళ్లకీ కరోనా సోకాలని శపించడం ద్వారా ఆ వైరస్ వ్యాప్తికి పరోక్షంగా ప్రోత్సహిస్తున్న మీకే న్యాయంగా శిక్ష(?) పడాలి’ అని రివర్స్ శాపనార్థాలకు దిగారు. ఆంధ్రజ్యోతికి ఇటువంటి హెచ్చరికలు అటవాటేనని ధీమా వ్యక్తం చేశారు. ‘మీరు గుడ్లురిమితే ఇక్కడెవరూ భయపడరని, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేం సిద్దంగా లేము’ అన్నారు.

‘ఆరేళ్లుగా ఫామ్ హౌస్ లోనో, ప్రగతి భవన్ లోనో సెల్ఫ్ ఐసొలేషన్ ఉన్న మీకు ఇప్పటి లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలిసే అవకాశం లేనందున, ప్రజా సమస్యలను మేం బాజాప్తా ప్రచురిస్తాం. ప్రచురిస్తూనే ఉంటాం’ అని ముక్తాయించారు.

ఈ తరహాలో సాగిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ రాతల వ్యాఖ్యల్లో అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంతగా లోతైన పరమార్థం దాగి ఉందని జర్నలిస్టు సర్కిళ్లు అభివర్ణిస్తున్నాయి. అంటే తనపై కేసీఆర్ పూర్తి స్థాయిలో ‘యాక్షన్’కు దిగకముందే రాధాకృష్ణ ‘రియాక్షన్’ ఖతర్నాక్ రాతలుగా జర్నలిస్టుల వర్గాలు ఉటంకిస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version