కొత్త సంవత్సరం కేలండర్ అంటే ఎలా ఉంటుంది. తేదీలు, పండగలు, పబ్బాలు వగైరా వంటి సమాచారం ఉంటుంది…అంతేగా? మహా అయితే దిగువ భాగాన్నే గాక కేలండర్ మాస్ట్ హెడ్ పక్కన వాణిజ్య ప్రకటనలు ఉంటాయి. ప్రముఖ పత్రికలతోపాటు వివిధ సంస్థలు ప్రచురించి, పంపిణీ చేసే కేలండర్లలో ఇంతకన్నా ఆశించడానికి ఏమీ ఉండదు. కేలంర్ ప్రచురించినవారికి ఆర్థిక లాభం, ప్రకటనలు ఇచ్చినవారికి అదో తుత్తి. కానీ ప్రజోపయోగ కేలండర్లు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇదిగో ఇలా…

తెలంగాణా రెవెన్యూ మాస పత్రిక తరపున డిప్యూటీ కలెక్టర్ వి. లచ్చిరెడ్డి ఎడిటర్ గా విడుదల చేసిన కేలండర్ అత్యంత ఆసక్తిదాయకంగా ఉండడం విశేషం. అలాగని మాంచి సినిమా తారల బొమ్మలతో, కలర్ ఫుల్ గా కేలండర్ ఉందని కాదు. అటువంటివేవీ ఈ కేలండర్ లో మనకు కనిపించవు. ప్రతి పేజీలోనూ ప్రజోపయోగ సమాచారమే సాక్షాత్కరిస్తుంది. భలే ఉందే అనిపిస్తుంది. మనకు తెలియని అనేక అంశాలేకాదు, రెవెన్యూ పరిభాష పదాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. భూ లావాదేవీలు, సమస్యలకు సంబంధించిన అనేక అంశాలను పొందుపరుస్తూ విడుదల చేసి ఈ కేలండర్ తీరు తెన్నులను అభినందించక తప్పదు.

పిటి రిజిస్టర్, 38-ఈ సర్టిఫికెట్, పంచనామా, అసైన్డ్ భూములు కొనుగోలు చేయవచ్చా? రెవెన్యూ పదాలు, అర్థాలు, పహణి, సేత్వార్, సర్వే రికార్డులు, సరిహద్దు తగాదాలు, సీలింగ్ భూములు, గ్రామ కంఠం, భూబదలాయింపు చట్టం (ఎల్ టీ ఆర్), ముటేషన్, ఇనాం భూములు, గిరిజనుల భూములు, 1-బి రిజిస్టర్ (ఆర్వోఆర్), ఫసలీ సంవత్సరం, శివాయి జమదారు, ఖాతా నెంబరు, రాస్తా సమస్యలు, ఆడపిల్లలకు ఆస్తిలో వాటా, జాయింట్ పట్టా అంటే ఏమిటి? ఇనాం, అసైన్డ్,  భూదాన్ భూములకు గల తేడా, ఖస్రా పహణి, భూ సమస్యలపై సందేహాలు, సమాధానాలు, గ్రామ పటం, పొలం కొలతల పుస్తకం (టిప్పన్), ఆర్వోఆర్ చట్టం వర్తించే భూములు, వారసత్వ, కొనుగోలు చేసిన భూములకు పట్టా పొందడం ఎలా? తదితర అంశాలను ఈ కేలండర్ లో పొందుపర్చడం విశేషం. అంతేకాదు తెలంగాణాలోని 33 జిల్లాల రెవెన్యూ స్వరూపం, అధికారుల ఫోన్ నెంబర్లను కూడా పొందుపర్చారు. భూ సమస్యలకు సంబంధించిన అంశాలపై సామాన్య ప్రజలకే కాదు, కొత్తగా రెవెన్యూ శాఖలో చేరిన నేటితరం ఉద్యోగులకు ఈ కేలండర్ ఎంతో ఉపయోగకరమని చెప్పక తప్పదు. కేలండర్ స్వరూపాన్ని దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version