కరోనా వైరస్ విశ్వాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా అంతు తేల్చడానికి, సూది మందు కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో శతవిధాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ అంటూ కాస్త ఆశాజనక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా మందు కాస్త ఆలస్యమవుతుందేమోగాని, ‘కరోనా ప్రూఫ్’ కారు మాత్రం రానే వచ్చింది. కరోనా వైరస్ కారకంగా ప్రాచుర్యం పొందిన చైనా దేశపు కంపెనీయే ఈ కారును విడుదల చేయడం విశేషం.
చైనాకు చెందిన ‘గీలీ’ ఆటోమోబైల్ సంస్థ ఈ కారును రూపొందించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. హెల్దీ కార్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారును గీలీ సంస్థ రూపొందించిందట. ‘జీ క్లీన్’ ఇంటలిజెంట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కారులోని గాలిలో కలిసిన సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుందట. ఇంకా ఈ కారులో అనేక విశిష్టతలున్నట్లు వార్తా కథనాల సారాంశం. ముఖ్యంగా సూక్ష్మ క్రిముల నాశనమే ప్రధానంగా కారు ఫీచర్స్ ఉన్నాయట. కారు లోపలి భాగానికి సంబంధించిన ఫొటోలను ‘గీలీ’ సంస్థ విడుదల చేసింది. కారు ధర తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
కరోనాను ఎదుర్కునేందుకు టీకా మందు కోసం ప్రపంచం ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో ‘గీలీ’ సంస్థ ఈ కారును విడుదల చేయడం విశేషం. కరోనా వ్యాధి నివారణకు టీకా వచ్చేంత వరకు ఈ కారును కొనగలితే ఆర్థిక శక్తిమంతులు మాత్రం కాస్త ‘సేఫ్’గానే ఉండొచ్చన్నమాట. మరి పేదలు, సామాన్యుల మాటేమిటీ… అంటారా? దిక్కులేని వారికి దేవుడే దిక్కు.