ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టులో నడుస్తున్న కేసులు చూస్తుంటే 1970 దశకం నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. వారానికో, పక్షానికో, నెలకోసారో కోర్టు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూనే ఉంది. ఇంచుమించు ఇదే పద్దతిలో ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయాలను అప్పట్లో సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
చాలా కేసులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. ఆమాటకొస్తే రెండు మూడు రాజ్యాంగ సవరణలను సైతం సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రాజ్యాంగంలో ఇచ్చిన అధికార పరిధిని మించి ప్రభుత్వం పని చేస్తోందని కోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. ఇంచుమించు కోర్టు, ప్రభుత్వం మధ్య యుద్ధమే నడిచింది. ఈ యుద్ధంలో తనది పైచేయి అనిపించుకునేందుకు ఇందిరా గాంధీ న్యాయశాస్త్ర ఉద్దండులను రంగంలోకి దింపింది.
బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్ ఆర్ గోఖలేను కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా, మరో న్యాయ కోవిదుడు మోహన్ కుమార మంగళాన్ని ఉక్కు శాఖ మంత్రిగా శ్రీమతి గాంధీ నియమించుకున్నారు. వీరిద్దరితో పాటు విద్యా శాఖ మంత్రిగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మరో న్యాయ కోవిదుడు సిద్ధార్థ శంకర్ రే ఇందిరా గాంధీకి అండగా నిలిచారు. సుప్రీంకోర్టుతో ఇందిరాగాంధీ చేసిన పోరాటంలో ఈ ముగ్గురూ ఆమెకు అనుకూలంగా కీలక పాత్ర పోషించారు.
ఇందిరా గాంధీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఈ ముగ్గురు న్యాయ కోవిదులు ఆడిన ఆటలో జ్యుడీషియరీపై లెజిస్లేచర్ విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను (జె ఎం షెలాత్, ఏ ఎన్ గ్రోవర్, కె ఎస్ హెగ్డే) పక్కన పెట్టి నాలుగో స్థానంలో ఉన్న ఏ ఎన్ రే ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఈ నియామకాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా వ్యతిరేకించినా శ్రీమతి గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి ముగ్గురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేశారు.
ప్రధానమంత్రి అయ్యేనాటికి ఇందిరాగాంధీ రాజకీయాలకు కొత్త కాదు. తండ్రి నెహ్రూ కార్యదర్శిగా ఆమె పనిచేశారు. ఆ తర్వాత శాస్త్రి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయినా అప్పటి రాజకీయ ఉద్దండులు, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు శ్రీమతి ఇందిరాగాంధీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండడం వల్లనో లేక ఆమె నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా లేని కారణంగానో కోర్టునుండి అక్షింతలు పడుతూనే ఉండేవి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన రాజకీయాలకు కొత్త కాదు.
అనుభవజ్ఞులైన ప్రత్యర్ధులు ఉన్నందువల్లనో లేక రాజ్యాంగానికి, చట్టాలకు అనుగుణంగా ఆయన ప్రభుత్వ నిర్ణయాలు లేకపోవడం వల్లనో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తరచుగా కోర్టునుండి మొట్టికాయలు తింటూనే ఉంది. అయితే ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీకి ఉన్న (న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం) వెసులుబాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. అందువల్ల ఆయన ఇప్పుడు చేయాల్సింది న్యాయ నిపుణులతో సంప్రదించి ప్రతి నిర్ణయం చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్దంగా ఉండేలా చూసుకోవడమే.
1971 ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధులపై మొత్తం 518 లోక్ సభ స్థానాల్లో పోటీచేసి 352 స్థానాల్లో భారీ విజయం సాధించిన శ్రీమతి ఇందిరా గాంధీ, 1977 ఎన్నికల్లో మొత్తం 542 స్థానాల్లో 189 స్థానాలు మాత్రమే గెలిచి భారీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో గెలిచి భారీ విజయం సాధించామనుకుంటే, ఆ ఉద్దేశంతోనే కోర్టు నుండి ఇలా మొట్టికాయలు తింటూ ఉంటే… 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, కోర్టు తీర్పుల ప్రభావం సాధారణ ఎన్నికల్లో ఎంత ఉంటుందో చరిత్ర పుటలు చూస్తే తెలుస్తుంది.
✍️ దారా గోపి