ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఎందుకు అదృశ్యమయ్యారు? ఓ దేశాధినేత అకస్మాత్తుగా మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి? దాదాపు మూడు వారాల పాటు కనిపించకుండా పోయిన కిమ్ అదృశ్యంపై తాజాగా వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. అయితే ఓ ఎరువుల ఫ్యాక్టరీ కార్యక్రమంలో కిమ్ ప్రజల ముందుకు వచ్చినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ (కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) కొన్ని ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇంతకీ కిమ్ ఇన్నాళ్లపాటు ప్రజలకు కనిపించకుండా ఎక్కడికి వెళ్లినట్లు? ఆయన అదృశ్యంపై ప్రపంచ దేశాలు ఎందుకు ఆసక్తిని కనబర్చినట్లు? ఉత్తర కొరియా బద్ధ శత్రు దేశాలైన దక్షిణ కొరియా, అమెరికా అధినేతలు కిమ్ మరణించాడనే వార్తలను ఎందుకు విశ్వసించలేదు? కిమ్ మరణ వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే చైనా ఓ మెడికల్ టీమ్ ను కూడా ఉత్తర కొరియాకు పంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు కిమ్ సజీవంగానే ఉన్నట్లు కేసీఎన్ఏ విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. కిమ్ తో తాను ఈ వారంలో మాట్లాడనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించారు.
ఆయా పరిణామాల్లో అసలు కిమ్ ఎందుకు అదృశ్యమయ్యారన్నదే అసలు ప్రశ్న. ఈ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో అప్పుడే ఓ ఆసక్తికర అంశం వ్యాప్తిలోకి వచ్చింది. కిమ్ నియంత అనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే కదా? అందుకే… ఒకవేళ తాను చనిపోతే ఉత్తర కొరియాలోనేగాక శత్రుదేశాలైన దక్షిణ కొరియా, అమెరికా ఏ విధంగా వ్యవహరిస్తాయి? మిగతా ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి? మిత్రుల మాటేమిటి? శత్రువుల వైఖరేమిటి? అంతర్గతంగా తన దేశంలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే అంశాలను నిశితంగా గమనించడానికే కిమ్ పక్కా ప్లాన్ వేశారట. అందుకే అకస్మాత్తుగా ఆయన అదృశ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ప్రచారానికి ఎటువంటి క్లారిటీ లేకపోయినా…. కిమ్ వ్యవహార శైలి గురించి తెలిసిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మాత్రం ‘అయితే కావచ్చు… నియంతల తీరు ఎలాగైనా ఉండవచ్చు’ అని వ్యాఖ్యానిస్తుండడం విశేషం.