(గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష వెనుక సుదీర్ధమైన చారిత్రక నేపథ్యం.. 150 ఏండ్ల దు:ఖం ఉన్నదంటే అతిశయోక్తి అనిపించినా అది అక్షర సత్యం. నిజాం కాలంలో ప్రధానిగా ఉన్న మొదటి సాలార్ జంగ్ పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు ఉర్దూ భాషపై పట్టున్నవారందరినీ రప్పించి ఉద్యోగాల్లో నియమించారు. ఇలా స్థానికేతరులైన ఉత్తర భారతదేశ వాసులు హైదరాబాద్ రాజ్యంలో తిష్టవేయడాన్ని వ్యతిరేకిస్తూ 1868లోనే నిజాం రాజు ఎదుట తెలంగాణ ప్రజలు నిరసన తెలిపారు. అక్కడి నుంచి మొదలు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణలను కలిపి 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు వరకు తెలంగాణ ప్రజలు అన్ని సందర్భాల్లో నిరసిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం పుట్టి మూడు దశాబ్దాలపాటు వివిధ రూపాల్లో ఉద్యమాలు, నిరసనలు, అనంతరం 2001లో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపన, మలిదశ స్వరాష్ట్ర సాధన పోరాటంలో కలిపి వందలాదిమంది అమరులు ప్రాణత్యాగం చేశారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు స్వప్నించిన తెలంగాణ రాష్ట్రసాధన కలను సాకారం చేశారు కేసీఆర్. అలాంటి ఉద్యమ నాయకుడే పాలకుడు కావాలని ప్రజలు కోరుకున్నారు.
‘‘ దశాబ్దాల ద్రోహంతో విసిగిపోయిన ప్రజలు…
ఎడతెగని ఉద్యమాలతో అలసిపోయిన ప్రాణాలు.
స్వరాష్ట్రంలో సంక్షేమం పథకాలతో హాయిగా సేదతీరుతున్నాయి
తమ కోసం ఓ ప్రభుత్వం వుందని ధీమాగా బతుకుతున్నాయి.’’
2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 20వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ముఖ్య ఘట్టాలు, సంఘటనల సమాహారాన్ని మరోసారి నెమరు వేసుకుందాం.
-2001 ఏప్రిల్ 27 – కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు.
-2001 మే 17 – టిఆరఎస్ కరీంనగర్ లో లక్షలాది మందితో సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.
-2001 జూన్ 25 – 610 జీవో అమలుతీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.ఎం.గిర్‌గ్లానితో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
-2001 అక్బోబర్ 6 – జె.ఎం.గిర్ గ్లాని కమిషన్ మధ్యంతర నివేదికను సమర్పించింది.
-2004 సెప్టెంబర్ – తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన జె.ఎం.గిర్ గ్లాని కమిషన్.
-2001 సెప్టెంబర్ 19 – ఆలె నరేంద్ర, మేచినేని కిషన్ రావు సారథ్యంలో తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు.
-2002 ఆగష్టు 11 – తెలంగాణ సాధన సమితి టిఆర్ఎస్ పార్టీలో విలీనం.
-2001 డిసెంబర్ 29 – 610 జీవో అధ్యయనంపై 18 మంది శాసనసభ్యులతో రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
-2002 సెప్టెంబర్ 23 – అక్టోబర్ 7- టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పల్లెబాట కార్యక్రమం నిర్వహించింది.
-2002 అక్టోబర్ 26 నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరు వదలకుండా కుట్ర పన్నుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిరసిస్తూ కెసిఆర్ టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ర్యాలీ తీశారు.
-2002 డిసెంబర్ 5 నుండి 2003 జనవరి 6 – టిఆర్ఎస్ జలసాధన ఉద్యమాన్ని చేపట్టింది.
-2003 మార్చి 17- 610 జీవో అమలుపై రేవూరి ప్రకాశ్ రెడ్డి కమిటీ మొదటి మధ్యంతర నివేదిక సమర్పణ.
-2003 మార్చి 27 – కేంద్రానికి తెలంగాణ డిమాండ్ ను గట్టిగా వినిపించాలనే సంకల్పంతో కెసిఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వేయి వరకార్ల ర్యాలీ నిర్వహించారు.
-2003 ఏప్రిల్ 27 – టిఆర్ఎస్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వరంగల్ జైత్రయాత్ర సభకు జనం లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపారు. జనం బాగా తరలిరావాలని పిలుపునిస్తూ కెసిఆర్ సైకిల్ పై సభకు వచ్చారు.
-2003 మే 20 – 25 – రాజోలిబండ ప్రాజెక్టు కింద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కెసిఆర్ మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ నుండి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టారు.
-2003 జూన్ 11 610 – జీవో అమలులో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ పార్టీ ధర్నా
-2003 జూన్ 28 610 – జీవో అమలులో నిర్లక్ష్యం పై టిఆర్ఎస్ పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహణ
-2003 ఆగష్టు 25 – 30 – నాగార్జునసాగర్ ఎడమకాలువపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లాలోని కోదాడ నుండి హాలియా వరకు కెసిఆర్ పాదయాత్ర చేశారు.
-2003 ఆగష్టు 24 – తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు టిఆర్ఎస్ పాలమూరులో కొల్లాపూర్ కోలాహలం పేరుతో కొల్లాపూర్ లో బహిరంగసభ నిర్వహణ.
-2003 సెప్టెంబర్ 1 – టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నల్గొండ జిల్లా నాగర్ కర్నూల్ లో నాగర్ కర్నూల్ నగరా పేరుతో సభ నిర్వహించింది.
-2003 సెప్టెంబర్ 9 – కెసిఆర్ ఢిల్లీలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జాతీయ సదస్సు నిర్వహించారు.
-2003 జూలై 30 – మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ నుంచి గద్వాల వరకు కెసిఆర్ 180 కి.మీ. పాదయాత్ర అనంతరం గద్వాల్ లో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహణ.
-2003 ఆగష్టు 25 – నల్లగొండ జిల్లాలోని కోదాడ కెసిఆర్ మరోసారి పాదయాత్ర చేశారు. హాలియా వరకు కొనసాగిన ఈ పాదయాత్ర ఆగష్టు 30న ముగిసింది.
-2003 సెప్టెంబర్ 9 – ఢిల్లీలోని మౌలంకర్ హోటల్ లో నూతన రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాడుతున్న ఉద్యమ నేతలతో కెసిఆర్ సమావేశం ఏర్పాటు చేశారు.
-2003 సెప్టెంబర్ 17 – టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు విద్యార్థులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
-2003 అక్టోబర్ 22 – పుణ్యక్షేత్రమైన మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం నవంబర్ 2 వరకు కొనసాగింది.
-2003 నవంబర్ 14 – 610 జీవో అమలుపై రేవూరి ప్రకాశ్ రెడ్డి మరొక మధ్యంతర నివేదిక సమర్పణ.
-2003 నవంబర్ 19 – టిఆర్ఎస్ సంగారెడ్డిలో సింగూరు సింహగర్జన సభ నిర్వహణ
-2003 నవంబర్ 21 – మహబూబ్ నగర్ లో పాలమూరు సింహగర్జన సభ నిర్వహించిన టిఆర్ఎస్
-2003 డిసెంబర్ 3 – నిజామాబాద్ లో టిఆర్ఎస్ ఇందూరు సింహగర్జన సభ
-2003 డిసెంబర్ 5 – జనగాంలో టిఆర్ఎస్ ఓరుగల్లు వీరగర్జన సభ
-2003 డిసెంబర్ 16 – సిరిసిల్లలో టిఆర్ఎస్ కరీంనగర్ కదనభేరి సభ
-2004 – సోనియాగాంధీ కరీంనగర్ బహిరంగ సభలో టి.ఆర్.ఎస్ గులాబి కండువా వేసుకుని తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు.
-2004 ఏప్రిల్ 20, 26 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలు జరిగాయి.
-2004 మే 11 – అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం, మజ్లిస్ పార్టీ ఎన్నికలలో పొత్తులు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. తెలుగు దేశం, బి.జె.పి. పార్టీలు ఒక కూటమిగా పోటీ చేశారు.
-2004 మే – పార్లమెంట్, శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం టిఆర్ఎస్ అటు కేంద్రంలో యుపిఎలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరింది.
-2004 మే 26 – తెలంగాణ అంశాన్ని యూపీఏ మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చారు.
-2004 మే 27 – పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమ ప్రసంగంలో ‘అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి, సరైన సమయంలో యు.పి.ఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుంది’ అని పేర్కొన్నారు.
-2004 జూన్ 7 – రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.
-2005 జనవరి 6 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సంప్రదింపులకై ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయబడింది.
-2005 జూన్ 23 – ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుట్రలతో విసుగుచెంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలిగిన టిఆర్ఎస్
-2005 జూలై 17 – కాంగ్రెస్ ప్రభుత్వం నుండి టిఆర్ఎస్ బయటకు రావడానికి గల కారణాలను తెలపడానికి వరంగల్ లో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ
-2005 సెప్టెంబర్ 1 – బూటకపు ఎన్ కౌంటర్లను నిలిపివేయాల్సిందిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్న ఆదేశించాలని కోరుతూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన కెసిఆర్
-2005 సెప్టెంబర్ 10 – 12 – ఎంపిక చేసిన 500 మంది కార్యకర్తలకు తెలంగాణలోని వివిధ అంశాలపై శిక్షన తరగతుల నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ. వీరినే తెలంగాన జాగరణ సేన గా వ్యవహరించారు.
-2006 ఆగష్టు 3 – యుపిఎ మంత్రివర్గం నుండి టిఆర్ఎస్ మంత్రులు కెసిఆర్, ఆలె నరేంద్ర వైదొలిగారు.
-2006 సెప్టెంబర్ 12 – కె. కేశవ రావు సవాల్ ను స్వీకరించి కరీంనగర్ ఎంపి పదవికి రాజీనామా చేసిన కెసిఆర్
-2006 అక్టోబర్ 8 – టిఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్ధిపేట సమరశంఖారావం సభ నిర్వహణ
-2006 డిసెంబర్ 6 – 610 జీఓ అమలుకోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ ఏర్పాటు.
-2007 ఏప్రిల్ 6 – 12 – నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో కెసిఆర్ పర్యటించారు.
-2007 జూలై 15 మైనార్టీలపై నియమించిన సచార్ కమిటీ సిఫార్సుల అమలుకై ఇందిరా పార్కు వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేసిన కెసిఆర్
-2007 నవంబర్ 15 – పసునూరి దయాకర్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించిన కెసిఆర్
-2008 జనవరి 20 – సీపీఐ కేంద్ర నాయకత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు మద్దతు తెలిపింది.
-2008 అక్టోబర్ 9 – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని టీడీపీ ప్రకటించింది.
-2008 అక్టోబర్ 18 – తెలంగాణ ఏర్పాటు తమకు సమ్మతమేనని టిడిపి అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.
-2008 నవంబర్ 3 కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి పరిరక్షణకై తెలంగాన జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ స్థాపన.
-2008 నవంబర్ 13 – సికింద్రాబాద్ లో “సంకల్ప యాత్ర” పేరుతో బిజెపి బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
-2009 ఫిబ్రవరి 12 – అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ అంశంపై ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయసభల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
-2009 ఫిబ్రవరి 12 – తెలంగాణకు కట్టుబడి ఉన్నామని రోజున అప్పటి సీ.ఎం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు.
-2009, ఫిబ్రవరి 12 – నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ అంశంపై ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో కమిటీ ఏర్పాటు.
-2009 ఏప్రిల్ 16, 24 – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్, టిడిపి, సిపిఐ, సిపిఎం మహాకూటమిగా పోటీచేశాయి.
-2009 మే 16 – ఎన్నికల ఫలితాల ప్రకటన. కాంగ్రెస్ విజయం
-2009 అక్టోబర్ 9 – రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించిన 14ఎఫ్ హైదరాబాద్ సిటి పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ ఉండదు అని సుప్రీం ధర్మాసనం తీర్పు
-2009 నవంబర్ 29 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
-2009 డిసెంబర్ 4 – మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీని ఏర్పాటు
-2009 డిసెంబర్ 7 – మొదటి వారంలో నాటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన సమావేశమైన సీఎల్పీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని సోనియాగాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసింది.
-2009 డిసెంబర్ 9 – కెసిఆర్ దీక్షతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి చిదంబరంతో ప్రకటన చేయించింది.
-2009 డిసెంబర్ 9 – కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమిణ.( 11 రోజులపాటు సాగింది) -2009 డిసెంబర్ 23 – కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం మరో ప్రకటన చేస్తూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 9 – తెలంగాణ ప్రకటన తర్వాత మారిన పరిస్థితులపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. దీంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది.
-2009 డిసెంబర్ 24 – టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసి), తెలంగాణ కోసం పనిచేస్తున్న దాదాపు అన్ని ప్రజా సంఘాల నాయకులు సమావేశమై ప్రొఫెసర్ కోదండరామ్ ఛైర్మన్ గా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ – టిజెఎసి) ఏర్పాటైంది.
-2010 జనవరి 3 – ఉస్మానియా యూనివర్సటిలో తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ
-2010 జనవరి 5 – తెలంగాణ పై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
-2010 ఫిబ్రవరి 3 – తెలంగాణ అంశం పై శ్రీ కృష్ణ కమిటీ నియామకం
-2010 ఫిబ్రవరి 15 – శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్యేల రాజీనామాలను డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థుల ప్రదర్శన. పోలీసుల లాఠిఛార్జి. భాష్పవాయు ప్రయోగం. రణరంగమైన ఉస్మానియా యూనివర్సిటి.
-2010 మార్చి 21 – గన్ పార్క్ నుండి మణుగూరు వరకు టిజెఎసి బస్సు యాత్ర. మణుగూరులో బహిరంగ సభ.
-2010 మే 28 – మానుకోటలో జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకున్న తెలంగాణవాదులు. తెలంగాణవాదుల నిరసనలు, పోలీసు కాల్పులతో మానుకోట యుద్ధభూమిని తలపించింది.
-2010 డిసెంబర్ 16 – శ్రీకృష్ణ కమిటీ వెంటనే నివేదిక ఇవ్వాలంటూ “ఓరుగల్లు గర్జన” పేరుతో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.
-2010 జనవరి 31 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ తెలంగాణ మహిళ ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి మహిళ సదస్సు జరిగింది.
-2010 ఫిబ్రవరి 3 – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యను పరిష్కరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.
-2010 ఫిబ్రవరి 10 – తెలంగాణ సాధన కోసం విద్యార్థి జెఎసి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి చేపట్టిన ఓయు విద్యార్థులు
-2010 అక్టోబర్ 4 – టిజెఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ కొరకు జర్నలిస్టులు హైదరాబాద్ మీడియా మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
-2010 డిసెంబర్ 30 – శ్రీకృష్ణ కమిటీ కేంద్ర హోంశాఖ నివేదిక సమర్పించింది.
-2011 జనవరి 6 – శ్రీ కృష్ణ కమిటీ సమర్పించిన 505 పేజీల నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆరు పరిష్కారాలను సూచించింది.
-2011 ఫిబ్రవరి 17 – తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ప్రారింభించిన ప్రభుత్వ ఉద్యోగులు. మార్చి 4 వరకు మొత్తం 16 రోజులపాటు సహాయ నిరాకరణ కొనసాగింది.
-2011 మార్చి 1 – పల్లె పల్లె పట్టాలపైకి పేరుతో రైళ్ళ బంద్ కార్యక్రమాన్ని టిజెఎసి విజయవంతంగా చేపట్టింది.
-2011 మార్చి 10 – మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ‘మిలియన్ మార్చ్’ నిరసన కార్యక్రమం జరిగింది.
-2011 మే 14 – టిఆర్ఎస్ పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు
-2011 జూన్ 19 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ రోడ్ల పై వంటవార్పు కార్యక్రమం
-2011 జూన్ 21 – తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మరణం
-2011 ఆగష్టు 3 – 14 ఎఫ్ పై తెలంగాణ అంతటా విద్యార్థులు, జెఎసి ఆధ్వర్యంలో ధర్నా.
-2011 సెప్టెంబర్ 12 కరీంనగర్ లో టిఆర్ఎస్ జనగర్జన సభ నిర్వహణ.
-2011 సెప్టెంబర్ 13 – మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకఘట్టమైన సకలజనుల సమ్మె ప్రారంభమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నేతృత్వంలో 42 రోజులపాటు నిరాటంకంగా ఈ పోరాటం సాగింది.
-2012 సెప్టెంబర్ 30 – హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో టిజెఎసి ఆధ్వర్యంలో ‘తెలంగాణ మార్చ్(సాగరహారం)’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
-2011 అక్టోబర్ 24 – 42 రోజులపాటు కొనసాగిన సకల జనుల సమ్మె ముగిసింది.
-2012 డిసెంబర్ 28 – కేంద్రం తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించి ఢిల్లీలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
-2013 జనవరి 27, 28 – జెఎసి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద తెలంగాణ కొరకు 36 గంటల సమర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.
-2013 మార్చి 21 – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై చర్చ చేపట్టాలని ఒత్తిడి తెచ్చేందుకు జెఎసి సడక్ బంద్ కార్యక్రమం చేపట్టింది.
-2013 జూన్ 14 – టిజెఎసి పిలుపుతో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణవాదులు.
-2013 జూలై 30 – హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది.
-2013 ఆగష్టు 5 – నాటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంట్లో ప్రకటించారు.
-2013 ఆగష్టు 6 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆంటోని కమిటీని ఏర్పాటు చేసింది.
-2013 సెప్టెంబర్ 29 – నిజాం కళాశాలలో టిజెఎసి ఆధ్వర్యంలో ‘సకల జనభేరి భారీ’ బహిరంగ సభ
-2013 సెప్టెంబర్ 21 – ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు నేతృత్వంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో సమైక్యాంధ్ర సభ నిర్వహించారు.
2013 అక్టోబర్ 3 – కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోట్ ను కేంద్ర క్యాబినేట్ ఆమోదించింది.
-2013 అక్టోబర్ 8 – రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్‌గా మంత్రుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
-2013 డిసంబర్ 5 – కేంద్ర క్యాబినేట్ హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ముసాయిదా బిల్లు 2013 ను ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది.
-2013 డిసెంబర్ 11 – కేంద్ర క్యాబినేట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదా బిల్లు 2013 ను ఆమోదించి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు పంపారు.
-2013 డిసంబర్ 12 – తెలంగాణ ముసాయిదా బిల్లు 2013 ను ఆంధ్రప్రదేశ్ సీఎస్ పి.కె.మహంతికి అప్పగించిన కేంద్ర హోంశాఖ అధికారులు.
-2013 డిసెంబర్ 13 – అసెంబ్లీకి చేరిన తెలంగాణ ముసాయిదా బిల్లు
-2013 డిసెంబర్ 16 – బిల్లు పై చర్చ ప్రారంభమైందని ప్రకటించిన అసెంబ్లీలో ప్రకటించిన అప్పటి శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
-2014 జనవరి 6 – అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ బిల్లు పై చర్చ ప్రారంభమైంది.
-2014 జనవరి 30 – అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించి కేంద్రానికి పంపారు.
-2014 ఫిబ్రవరి 7 – జిఒఎం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర క్యాబినేట్ ఆమోదించింది.
-2014 ఫిబ్రవరి 18 – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
-2014 ఫిబ్రవరి 20 – రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
-2014 ఫిబ్రవరి 28 – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి రాష్ట్రపతి పాలన విధింపు. – 2014 జూన్ 2న రాష్ట్రపతి పాలన ఎత్తివేత.
– 2014 మార్చి 1 – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ) బిల్లు – 2014ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.
-2014 మార్చి 2 – ఆవిర్భావ తేది లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
-2014 మార్చి 4 – భారతదేశంలో 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
-2014 ఏప్రిల్ 30, మే 7 – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి.
-2014 ఏప్రిల్ 30 – తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు.
-2014 మే 7- ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
-2014 మే 16 – అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ మెజారిటి స్థానాలు సాధించింది.
-2014 జూన్ 2 – తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
-2014 జూన్ 2- టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరింది.
-2018 సెప్టెంబర్ 6 – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాజీనామాతో శాసనసభ రద్దు.
-2018 డిసెంబర్ 7 – తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ.
-2018 డిసెంబర్ 11 – అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన. టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం.
-2018 డిసెంబర్ 13 – రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.
( టీఆర్ఎస్ పార్టీ 20వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా..)