కరోనా కల్లోల పరిస్థితుల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న ప్రజలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కొద్ది రోజుల క్రితం ఆగ్రహించిన సంగతి తెలిసిందే. ఆయనంటే జిల్లా కలెక్టర్. సర్వాధికారాలు ఉంటాయ్. మెజిస్టీరియల్ పవర్స్ కూడా కలిగి ఉంటారు. ప్రజారక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో కలెక్టర్ తీసుకునే చర్యలను ఎవరూ అక్షేపించరు.
అదేవిధంగా కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అంశాల్లో పోలీసులకూ ప్రభుత్వం మరికొన్ని అధికారాలను కల్పించింది. జన సంరక్షణ కోసం పోలీసులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ పరిధి మేరకే వ్యవహరిస్తున్నారు. అక్కడక్కడా కాస్త అతి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్న కొందరి గురించి కాసేపు వదిలేయండి. మొత్తంగా కరోనా కట్టడి విషయంలో పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖల సేవలు వెల కట్టలేనివి.
కరోనా కల్లోల పరిణామాల్లో అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, ఇంకోవైపు వైద్య, ఆరోగ్యశాఖకు చెందినవారేగాక ప్రజారోగ్యశాఖకు చెందిన పారిశుధ్య కార్మికులు సైతం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇతర శాఖలకు చెందిన కొందరు అధికారులు రోడ్లపైకి వచ్చి ‘ఓవర్ యాక్షన్’ చేస్తుండడమే విమర్శలకు తావు కల్పిస్తోంది. చేతిలో పోలీస్ కర్ర పట్టుకుని, కొందరు అనుచరులను వెంటేసుకుని సిరిసిల్ల పట్టణంలో హల్ చల్ చేస్తున్న ఈ వ్యక్తిని చూడండి. పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ ఆఫీసరట. మున్సిపాలిటీ ముందే తిష్టవేసి వచ్చీ, పోయే ద్విచక్ర వాహనదారులను అదిలిస్తూ, బెదిరిస్తూ బైక్ ల తాళాలు లాక్కుంటున్నాడు.
లాక్ డౌన్ పరిస్థితుల్లో జనం రోడ్ల మీదకు రాకుండా ఈ టీపీవో సారు చేస్తున్న చర్య ఓ రకంగా సముచితమే కావచ్చు. కానీ ఇతని నిర్వాకం పలుచగా వెళ్లే వాహనదారులు సమూహంగా ఏర్పడేందుకు దోహదపడడమే గమనార్హం. తాళాలు లాక్కుని, బైక్ లను పక్కన పార్కు చేయిస్తున్న తీరును, సోషల్ డిస్టెన్సింగ్ డిస్టర్బ్ అవుతున్న పరిస్థితిని కూడా దిగువన వీడియోలో చూడవచ్చు. టీపీవో సారూ…? ఇంతకీ ప్రభుత్వం తమరికి కేటాయించిన విధులు ఇవేనా? అని సిరిసిల్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారట. ప్రస్తుత కరోనా స్థితిలో షాపులు మూసి ఉన్నాయా? లేదా? అనే విధుల నిర్వహణను విస్మరించి, తనకు సంబంధం లేని డ్యూటీలో తలదూర్చారనే ఆరోపణలు వస్తున్నాయి. బహుషా కనిపించని నాలుగో సింహం బాధ్యతలను ఈ టీపీవో సారే భుజన వేసుకున్నారేమోనని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారట. టీపీవో సారు హల్ చల్ వ్యవహారపు వీడియో వైరల్ గా మారింది.
కొసమెరుపు ఏమిటంటే కొందరు విలేకరుల బైక్ ల తాళాలు కూడా ఈ టీపీవో సారు లాక్కున్నారట. ఇతని ఓవర్ యాక్షన్ సంగతిని గురువారం కలెక్టర్ దృష్టికీ తీసుకువెళ్లేందుకు మీడియావాళ్లు సంసిద్ధమవుతున్నట్లు ఈ వార్తా కథనం రాసే సమయానికి అందిన తాజా సమాచారం. ఇక టీపీవో సారు హల్ చల్ చేసిన వీడియోను దిగువన చూడండి.