Facebook X (Twitter) YouTube
    Tuesday, October 3
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»తలుపులేసుకోండి.. భవిష్యత్తు దేవునికెరుక!?

    తలుపులేసుకోండి.. భవిష్యత్తు దేవునికెరుక!?

    April 8, 20203 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 corona india

    కనిపించని శత్రువు రూపంలో కరోనా అనే వైరసొకటి ప్రపంచాన్ని నిస్తేజం చేస్తున్న సందర్భం ఇది. బహుశా.. ఇట్లాంటి ఒక చరిత్రను చూస్తామని, అనుభవంలోకి తీసుకుంటామని ఎవరూ ఊహించి ఉండరు. చైనాలోని వూహాన్‌లో పుట్టిందని చెబుతున్న వైరస్‌… ప్రపంచాన్ని చుట్టేస్తూ మనిషిని చూసి మనిషే భయపడేలా చిత్రమైన లోకాన్ని సృష్టిస్తోంది. నాసా వారి స్కైలాబ్‌ ప్రపంచం మీద ఎక్కడైనా కూలిపోవచ్చనే ప్రకటన 1979 జూలైలో ప్రజలను ఎంత గడగడలాడించిందో.. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు కరోనా కత్తులు దూస్తూ జనావళిని వణికిస్తున్నది.

    ఈ ఉత్పాతానికి కారణం మనిషి.. బలి అవుతున్నది మనిషి.. మూల్యం చెల్లించుకుంటున్నది మనిషి. మితి మీరిన ఆధిపత్యంతో మనిషి చెలరేగి ప్రకృతి సమతుల్యతకు చేటు తెస్తున్నప్పుడు.. . తానున్నానని ప్రకృతి బలంగా చాటే పరిణామమే కరోనా అని భావించాలి. సైన్స్‌తో, సాంకేతికతతో ప్రకృతి వీద పట్టు బిగించానని మనిషి గర్వించినప్పుడల్లా.. ప్రకృతి తానేమిటో చూపుతుంది. సునామీలు, భూకంపాలు, తుఫానులు ఆ కోవలోకే చెందుతాయి. వీటిని అనుభవించడమే తప్ప, అడ్డుకునే స్థాయికి మనిషి ఇంకా చేరుకోలేదు. చరిత్రను, వర్తమానాన్ని ఏ కోణంలో చూసినా మనిషిపైన ప్రకృతి ఆధిపత్యమే కనిపిస్తుంది. అది సృష్టి ధర్మం కాబోలు.

    కరోనా వైరస్‌ కొత్తదేమో కాని, వైరస్‌లు కొత్తకాదని, అనేకానేక వైరస్‌లున్న ప్రపంచంలోనే మనం తరతరాలుగా బతుకుతున్నామని వైద్యులు చెబుతున్న మాట. బ్యాక్టీరియాలు, వైరస్‌లు వాతావరణాన్ని బట్టి మనుషుల మీద దాడి చేస్తాయి. శారీరక బలహీనుల్లో తిష్ఠ వేసి రోగాలను సృష్టిస్తాయి. కరోనా వైరస్‌ది కూడా అదే కోవ. వైరస్‌ సోకిన వారిలో శారీరక బలహీనులు– అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, ఇతర రోగాలున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారని వివిధ దేశాల్లోని కరోనా మరణాల సమాచారం చెబుతోంది.

    ఢిల్లీలో మర్కజ్‌ ప్రార్థనలకు హాజరై వచ్చిన తబ్లీఘీ కార్యకర్తలకు కరోనా పాజిటివ్‌ రాగా, తొలిదశ పరీక్షల్లో వారి కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. ఢిల్లీలో కరోనా వైరస్‌ను అంటించుకొని వచ్చి, అనేక రోజులు వారు ఇంట్లోనే, కుటుంబసభ్యుల మధ్యే ఉన్నారు. కానీ కుటుంబంలో ఎవరికీ వైరస్‌ సోకకపోవడం విచిత్రం. అయితే ఇంక్యుబేషన్‌ పీరియడ్‌లో వైరస్‌ బయటకు పొక్కదని 28 రోజుల వరకు పరిశీలన అవసరమని వైద్యులు చెబుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో 28 రోజులు ఉంచి, కనీసం మూడుసార్లు చేసే పరీక్షల్లో నెగెటివ్‌ వస్తేనే వైరస్‌ లేనట్టని వారు పేర్కొంటున్నారు.

    ts29 corona boy

    తొలి దశ పరీక్షల్లో వారికి ఎందుకు సోకలేదో వైద్యులు గానీ, ప్రభుత్వం గానీ స్పష్టత ఇవ్వడం లేదు. కరోనా పాజిటివ్‌ రోగి ఉన్న ఇంట్లోనే ఇతరులకు వైరస్‌ సోకనప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే మాత్రం ఒకరినుంచి మరొకరికి సోకుతుందా.. అని సామాన్యులు ప్రశ్నిస్తుండటం వైద్యపరమైన అవగాహన లేమిని సూచించినా, వీటికి సర్కారు వారే జవాబివ్వాలి. పాజిటివ్‌ కేసులకు సంబంధించి హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలకు, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు విడుదల చేసే గణాంకాలకు పొంతన ఉండటం లేదు. అంటే పాజిటివ్‌ రోగుల సంఖ్యను వెల్లడి చేయడంలో ఏదో దాపరికం జరుగుతోందనే వాదన ఒకటి వినిపిస్తున్నది.

    కరోనా కల్లోలం ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు. అయితే రేపో మాపో, ఎప్పుడో ఒకప్పుడో వ్యాక్సిన్‌ రావొచ్చు. అది అమెరికాయే కనుగొనవచ్చు. మన పాలకులు కోట్లు ధారపోసి వాటిని కొనుగోలు చేయవచ్చు. ప్రజారోగ్యం పేరుతో ప్రజాధనం హారతికర్పూరమై పోవచ్చు. బతుకుమీది తీపి పేరుతో ఇందుకు ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ అనేకానేక వైరస్‌ల మాదిరిగానే కరోనా వైరస్‌ పూర్తిగా అంతం కాకుండా మన చుట్టూరా పొంచి ఉండవచ్చు. అది అదును దొరికినప్పుడల్లా శారీరక బలహీనులతో ఆడుకోవచ్చు. ఆరోగ్యవంతులు, రోగ నిరోధక శక్తి గల వారిలోకి ప్రవేశించినా చిన్నపాటి చికిత్సతోనే సద్దుమణిగిపోవచ్చు. లేదంటే అమలుకాని అనేకానేక ఆంక్షల మధ్య జనం కరోనా వైరస్‌తో నిత్య యద్ధం చేస్తూనే ఉండవచ్చు. చివరకు రోగనిరోధక శక్తి అనే కాన్సెప్టు వ్యాపార వస్తువుగా నిలిచి వెలగవచ్చు. దానిపేరిట వేలకోట్ల వ్యాపారం జరగవచ్చు.

    కానీ మనిషి ఆరోగ్యవంతుడిగా ఎలా మారాలి..? రోగనిరోధక శక్తిని బాడీలో ఎలా నింపుకోవాలన్నదే ప్రశ్న. పొగాకు ఉత్పత్తులకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ, మద్యం అమ్మకాలకు టార్గెట్లు పెడుతూ, గుట్కాల తయారీ, అమ్మకాలకు లోపాయికారిగా వత్తాసు పలుకుతూ, కల్తీ సామ్రాజ్య వ్యాపారులకు పదవులిస్తూ… అధికారలాలసలో మునిగి తేలే పాలకులున్నంత కాలం సామాన్యుడు ఆరోగ్యవంతుడిగా ఎలా నిలబడగలుగుతాడు…? మొత్తం జనాభాలో 60శాతం బీపీఎల్‌ వర్గాలున్న దేశం మనది. బతుకే యుద్ధమైన సగటు మనిషికి తన ఆరోగ్యంపై అంత శ్రద్ధ కనిపించదు. నిలబడగలిగే సత్తువ లేని దశ మాత్రమే అనారోగ్యం అనుకునే అమాయక జనం ఉన్న దేశం ఇది. వ్యాయామం… పోలీసు ఉద్యోగార్థులకు, షుగర్‌ పేషెంట్లకు మాత్రమే అనుకునే తీరికలేని జనం ఉన్న దేశం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా… ఉత్పాతాలను తట్టుకునే సన్నద్ధతను అలవర్చుకోకుండా ‘తలుపులేసుకోండి. తలుపులేసుకోండి..’ అని దబాయిస్తున్న పాలకులున్న మనదేశంలో ప్రజల భవిష్యత్తు ఏమిటో ఆ దేవుడికే ఎరుక.

    – శంకర్‌ శెంకేసి

    Previous Articleపెద్దాయనలా ఉన్నావ్… ఇదేం పని? కడిగేసిన చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని!
    Next Article నీ డ్యూటీ ఏంది? ఈ ఓవర్ యాక్షన్ ఏంది? సిరిసిల్లలో టీపీవో హల్ చల్!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.