నిత్యం ఏసీ కార్లలో తిరిగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎడ్ల బండిపై ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది? మేడారం జాతర ప్రత్యేకాధికారి, ములుగు జిల్లా ఇంచార్జ్, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణణ్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ మంగళవారం ఎడ్ల బండి ఎక్కి ప్రయాణించిన దృశ్యం మేడారం జాతర వార్తల్లో ప్రత్యేకమనే చెప్పాలి. ఇదేమీ వాళ్లు తమ సరదా కోసం చేసిన ప్రక్రియ కాదు. తమ బాధ్యతల నిర్వహణలో ఇదో భాగం.
గురువారం సమ్మక్క తల్లి గద్దెను అధిష్టించనున్నారు. చిలుకలగుట్ట అటవీ ప్రాంతం నుంచి సమ్మక్క తల్లి అరుదెంచిన తర్వాతే అశేష భక్త జనం తమ మొక్కులను చెల్లించుకుంటారు. సమ్మక్క తల్లిని తీసుకువచ్చే చిలుకలగుట్ట మార్గంలో ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కర్ణణ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ ఇలా ఎడ్ల బండిపై ప్రయాణించిన దృశ్యమిది. సోమవారం ఆటోలో ప్రయాణించిన కలెక్టర్ కర్ణణ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ మంగళవారం ఇలా ఎడ్డ బండిపై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండడం విశేషం. మేడారం జాతర ఇంచార్జ్ బాధ్యతలను కలెక్టర్ కర్ణణ్ కు ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు అప్పగించడం ఎందుకంటే… ఇదిగో ఇందుకన్న మాట. కారు వెళ్లలేని మార్గంలో ఎడ్ల బండి ఎక్కి మరీ జాతర బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ కర్ణణ్, ఎస్పీ సంగ్రామ్ ల విధి నిర్వహణ శైలిని భక్త జనం ప్రశంసిస్తున్నది.