చైనాలో వ్యాపించి ప్రపంచ దేశాలను భయపెడుతూ, తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ గురించి ఆ దేశానికి చెందిన యువతి ఒకరు వెల్లడించిన అంశాలు సంచలనం కలిగిస్తున్నాయి. తనకు తాను నర్సుగా ప్రకటించుకున్న ఆ యువతి విడుదల చేసిన వీడియోలోని అంశాలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాపించిన వుహాన్ చికిత్సా కేంద్రం ప్రాంతం నుంచి తాను వాస్తవాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాపించిన వ్యక్తికి సరైన చికిత్స అందించకుంటే ఆ వ్యక్తి నుంచి కనీసం 14 మందికి వైరస్ సంక్రమించే అవకాశమున్నట్లు ఆమె వెల్లడించారు. తొలుత వ్యాపించిన కరోనా వైరస్ తీవ్రతను 14X14 ప్రాతిపదికన గణించవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో 90 వేల మంది కరోనా వైరస్ బారిన పడినట్లు పేరు వెల్లడించని ఆ నర్సు చికిత్సా కేంద్రం నుంచి విడుదల చేసినట్లు పేర్కొన్న 48 సెకన్ల నిడివి గల వీడియోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో టిక్ టాక్ లో చక్కర్లు కొడుతోంది. దిగువన మీరూ చూడవచ్చు.