కొన్ని సంఘటనల తీవ్రతను పేరాల కొద్దీ రాసే అక్షరాల్లోనూ చెప్పలేం… వర్ణించలేం. కష్టపడి రాసినా విషయాన్ని కళ్ల ముందు సజీవంగా చూపలేం. కానీ ఓ ఫొటో మొత్తం ఘటన తీవ్రతను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది. ఇది కొత్తగా చెప్పే విషయమేమీ కాదు. ఇదిగో ఈ దృశ్యం కూడా అటువంటిదే.
ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఓ షాపు ముందు విగతజీవిగా పడి ఉన్న వ్యక్తి చిత్రమిది. చైనాలోని వుహాన్ పట్టణంలో గల నిర్మానుష్యపు వీధిలోని ఓ దుకాణం ముందు కనిపించిన ఈ సీన్ కరోనా వ్యాధి తీవ్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగానే ఇతను మరణించి ఉంటాడనే ఆందోళనతో అతని శవం దగ్గరకు కూడా వెళ్లడానికి ఎవరూ సాహసించడంలేదట. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని సర్జికల్ బ్యాగులో చుట్టి ఫోరెన్సిక్ లాబ్ కు పంపించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. మృతుని పూర్తి వివరాలు కనుక్కునేందుకు అంతర్జాతీయ పాత్రికేయులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.