పోడు భూముల అంశంపై, అటవీ అధికారులపై తరచూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేసే పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తాజాగా జర్నలిస్టులను టార్గెట్ చేశారు. ఏకంగా 1/70 యాక్ట్ అస్త్రాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. పినపాక నుంచి ఆదిలాబాద్ వరకు విలేకరుల సంగతి తేలాల్సిందేనంటున్నారు. విలేకరుల ఇండ్లు 1/70 చట్టం కంటే ముందు కట్టారా? తర్వాత కట్టారా? అనే విషయం తేలిపోవాలంటున్నారు. ‘ఇక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు తేలిపోవలసిందే… ఓడుతమా? గెలుస్తమా? తర్వాత సంగతి’ అని రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశం జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
జర్నలిస్టులపై రేగా కాంతారావు తన ఫ్రస్టేషన్ ను వ్యక్తం చేయడానికి గల కారణమేంటి? అనే విషయంపై ఆరా తీసినపుడు ఆసక్తికర అంశం వెలుగు చూసింది. నిన్న మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామంలో అనుమతి లేకుండా ఓ బోరు తవ్వుతున్నట్లు మణుగూరు విలేకరులు, స్థానిక రాజకీయ నాయకులు ఫోన్ల ద్వారా తమశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో బోరు మిషన్ ను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు తమ ఆఫీసుకు దానిని తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నాయకులు పలువురు తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్లు చేసి ఆయా బోరు మిషన్ ను వదిలేయాలని వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫోన్ల ధాటిిక తట్టుకోలేక తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారట.
ఇదే సమయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు తహశీల్దార్ కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. విషయం తెలుసుకోకుండా ఎమ్మెల్యే కాంతారావు ఆగ్రహంతో తమ ఆఫీసుకు వచ్చి ఇష్టారీతిన మాట్లాడి తనను మనస్తాపానికి గురిచేశారని తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో చెప్పుకుని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కాంతారావు మణుగూరు తహశీల్దార్ ఆఫీసుకు వచ్చి అతని కుర్చీలో కూర్చుని హల్ చల్ చేశారు. తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని బదిలీ చేయాల్సిందేనని ఎమ్మెల్యే కాంతారావు ఆఫీసులోనే కూర్చుని భీష్మించడంతో అనేక నాటకీయ పరిణామాల మధ్య అతన్ని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తనదైన శైలిలో ఈ అంశంలో పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే కాంతారావు పనిలో పనిగా జర్నలిస్టుల ఇండ్ల ప్రస్తావన తీసుకురావడమే చర్చకు దారి తీసింది.
ఈ సందర్భంగా ఆయన ఏకంగా 1/70 చట్టాన్ని ఉటంకిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం… షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనుల భూముల అమ్మకాలు, కొనుగోళ్లు వారి మధ్య మాత్రమే జరగాలి. గిరిజనుల, గిరిజనేతరుల మధ్య ఎటువంటి భూ లావాదేవీలు జరగరాదు. ఇందుకు విరుద్ధంగా జరిగే భూ క్రయ, విక్రయాలు చెల్లవు. ఇదీ స్థూలంగా 1/70 యాక్ట్ సారాంశం. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే షెడ్యూల్డు ఏరియాలో గిరిజనేతరుల కనీస నివాసం కూడా నిషేధమే.
పినపాక ఎమ్మెల్యే కాంతారావు ఓ బోరుబావి మిషన్ స్వాధీనపు ఘటనను ప్రామాణికంగా చేసుకుని విలేకరులను టార్గెట్ చేయడం గమనార్హం. అంతేగాక ప్రభుత్వ అధికారులు షెడ్యూల్డ్ ఏరియాలో అద్దెకు ఎలా ఉంటారని కూడా ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అధికారులు అద్దెకు ఉంటున్న ఇండ్లకు పర్మిషన్ ఉందా? అని కూడా నిలదీస్తున్నారు. గిరిజన చట్టాలను అతిక్రమించి ఇండ్లు ఎలా కట్టారని ప్రశ్నిస్తున్నారు. గిరిజనేతరులు ఈ ప్రాంతాల్లో కిరాయికి ఉండవద్దంటున్నారు. అటు గిరిజనేతర ప్రభుత్వ అధికారులను, ఇటు విలేకరుల ఇండ్లను టార్గెట్ గా చేసుకుని ఎమ్మెల్యే 1/70 చట్టాన్ని ఉటంకించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఎమ్మెల్యే కాంతారావు కేవలం విలేకరుల, ప్రభుత్వ అధికారుల విషయంలో మాత్రమే 1/70 చట్టాన్ని ప్రస్తావిస్తున్నారా? అధికార పార్టీలో గల గిరిజనేతర నాయకుల, కార్యకర్తలకు సంబంధించిన నిర్మాణాలను, ఆస్తులను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అనే ప్రశ్నలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తంగా 1/70 చట్టాన్ని అస్త్రంగా చేసుకుని రేగా కాంతారావు మున్ముందు ఎటువంటి అడుగులు వేస్తారనేది వేచి చూడాల్సిన అంశం.