Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»‘టార్గెట్’ పొంగులేటి..!

    ‘టార్గెట్’ పొంగులేటి..!

    February 21, 20234 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 తేల్చుకుందాం

    అధికార పార్టీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూకుడుకు బ్రేక్ వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఓ కీలక సమావేశానికి ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గడచిన యాభై రోజులుగా వివిధ కార్యక్రమాల ద్వారా అధికార పార్టీకి సవాల్ విసురుతున్న పొంగులేటి రాజకీయాన్ని కంట్రోల్ చేయడమే ఎజెండాగా నిర్వహించిన ఈ సమావేశానికి కీలక నాయకుడే డుమ్మా కొట్టడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రాజకీయాలను అతలాకుతలాం చేస్తున్న తాజా పరిణామాలను ఓసారి పరిశీలిస్తే విషయం బోధపడుతుంది.

    కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ రాజకీయాల్లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా ఎండగడుతున్నారు. పొంగులేటి వెంట అధికార పార్టీకి చెందిన కేడర్ తో పాటు ముఖ్య నేతలు కూడా పయనిస్తున్నారు. ముఖ్యంగా కొందరు మాజీ ఎమ్మెల్యేలతోపాటు భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, వైరా మున్సిపల్ చైర్మెన్ సూతకాని జైపాల్, మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మెన్ బొర్రా రాజశేఖర్ వంటి ముఖ్యులే గాక పలువురు సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా పొంగులేటి బాటలో పయనిస్తున్నారు.

    అటు ప్రభుత్వంపైనా, ఇటు సీఎం కేసీఆర్ పైనా హాట్ కామెంట్లు చేస్తూ, సవాల్ విసురుతున్న పొంగులేటి వెంట వెడుతున్నకేడర్ ను, లీడర్లను నిలువరించేందుకు ఇప్పటికే కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికీ పొంగులేటి వెంట వెళ్లేవారిని ఆపలేని పరిస్థితి ఏర్పడింది. ‘పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది..’ అంటూ పొంగులేటి పదే పదే స్పష్టం చేస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే అంశంపై స్పష్టత లేకున్నా, ఆయన వెంట వెళ్లేవారిని నిలువరించడమే ఎజెండాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు గత రాత్రి ఓ ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు.

    ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ‘ఇన్ కెమెరా’ మీటింగుకు మీడియాను కూడా దూరంగా ఉంచారు. పార్టీ కార్యాలయం గేట్ వద్దే మీడియా ప్రతినిధులను నిలువరించి మరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన ప్రకారం… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన, విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు మరింత ప్రచారం కల్పించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఖమ్మంలో గత నెల 18వ తేదీన జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు, మునిసిపల్, పట్టణాలు, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఇచ్చిన హామీలు, వెలువడిన ఉత్తర్వులు, కొనసాగుతున్న, మొదలు కావలసిన పనుల గురించి ప్రజాప్రతినిధులు సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి గతంలో చేసిన కృషిని, అంకితభావాన్ని ఈ సందర్భంగా నాయకులు నెమరు వేసుకున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేనివిధంగా కేసీఆర్ వినూత్న పథకాలు, కార్యక్రమాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా అమలు చేస్తుండడాన్ని ప్రజాప్రతినిధులు కొనియాడారు. వీటిని ప్రజల్లోకి మరింత విస్త్రతంగా తీసుకుపోవాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా తీసుకుపోవటానికి త్వరలోనే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

    మీటింగ్ ముగిశాక విడుదల చేసిన ఈ ప్రకటన సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు, ఆయన వెంట వెళ్లేవారిని నిలువరించడమే టార్గెట్ గా ఈ సమావేశం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇదే అంశం ఎజెండాగా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లోనూ ఓ సమావేశం నిర్వహించారు. తాజాగా ఖమ్మంలోనూ మరోసారి ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. గత రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పొంగులేటి వల్ల జరిగే నష్టం, నివారణ చర్యలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

    ఈ కీలక సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షత వహించారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం, సత్తుపల్లి, పాలేరు, అశ్వారావుపేట, వైరా, ఇల్లెందు,  ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్ లు పాల్గొన్నట్లు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటనలోనే వెల్లడించారు. టోటల్ ఎపిసోడ్ లో గమనించాల్సిన అంశమేమిటంటే బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఈ సమావేశానికి గైర్హాజరు కావడం. పొంగులేటిని కంట్రోల్ చేయడమే ఎజెండాగా రెండు గంటలపాటు సాగినట్లు ప్రచారంలో గల ఇంతటి ముఖ్య సమావేశానికి రేగా కాంతారావు డుమ్మా కొట్టడమేంటి? అనే సందేహాలను పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.

    నిజానికి పొంగులేటి కార్యకలాపాల వల్ల ఆదినుంచీ స్పీడుగా స్పందిస్తున్నది రేగా కాంతారావు అనేది అందరికీ తెలిసిందే. పొంగులేటి టార్గెట్ గా ఎమ్మెల్యే కాంతారావు సోషల్ మీడియాలో అనేకసార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి గత రాత్రి జరిగిన మీటింగును నిర్వహించాలని తలపోసింది కూడా రేగా కాంతారావేనని సమాచారం. నిన్న రోజంతా తన నియోజకవర్గంలోనే పర్యటించిన రేగా కాంతారావు ఈ కీలక సమావేశారి ఎందుకు దూరంగా ఉన్నారనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాను ఖమ్మం మీటింగుకు వెడుతున్నట్లు నిన్న మధ్యాహ్నం స్థానిక మీడియా వర్గాలకు కూడా చెప్పారట. కానీ ఎందుకోగాని రేగా కాంతారావు ఈ ముఖ్య సమావేశానికి దూరంగా ఉండడం బీఆర్ఎస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఎమ్మెల్యే రేగా కాంతారావును ts29 ప్రశ్నించగా, తాను ఖమ్మం సమావేశంలో పాల్గొనలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఓ ముఖ్యమైన పని ఉండడంతో తాను హాజరు కాలేకపోయానని, మీటింగుకు తాను రాలేకపోతున్నట్లు మంత్రి పువ్వాడకు సమాచారం ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పారు.

    BRS Politics khammam politics Ponguleti Srinivasareddy rega kantha rao ts29 Telegu news
    Previous Article‘చెప్రాసీగిరీ’ వల్లే పదవి
    Next Article అధికార పార్టీలో ‘తుమ్మల దర్బార్’

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.